భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రజా సేవ చేయడం ప్రారంభించి అక్టోబర్ 7కు సరిగ్గా ఇరవై ఏళ్లు. ఈ సందర్భంగా బీజేపీ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవాలని నిర్ణయించింది. ప్రధాని మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా 2001లో ప్రమాణం స్వీకరించనప్పటి నుంచి దాదాపు ఇరవై ఏళ్లు నిరంతరం ప్రజల కోసం సేవ చేస్తున్నారని, అందుకే ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. అక్టోబర్ 7న బీజేపీ కొన్ని బృహత్కరమైన కార్యక్రమాలను చేపట్టనున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా నదులను శుభ్రపరచడం, పలు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనాలని పార్టీ కార్యకర్తలకు బీజేపీ సూచించింది. అదేవిధంగా ప్రధాని నరేంద్రమోడీ చేసిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను బూత్ స్థాయి నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని బీజేపీ వెల్లడించింది.