సింగరేణి సంస్థ ఈ ఏడాది వచ్చిన లాభాల్లో కార్మికులకు 29 శాతం వాటాను ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది కంటే ఒకశాతం పెంచుతూ సింగరేణి కార్మికులకు ముఖ్య మంత్రి కెసిఆర్ దసరా కానుకను అందించారు. అంతే కాకుండా లాభాల్లో వాటాను దసరాకంటే ముందే చెల్లించాలని సిఎండీ శ్రీధర్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుందని ఈ సంధర్బంగా కేసీఆర్ పునరుద్ఘాటించారు. సింగరేణి కార్మికుల భవిష్యత్తు దృష్ట్యా సింగరేణి సంస్థ కార్యకలాపాలను విస్తృతపరచాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. బొగ్గుతవ్వకంతో పాటు ఇసుక, ఇనుము, సున్నపురాయి తదితర ఖనిజాల తవ్వకాల్లోకి సింగరేణి విస్తరించాల్సిన అవసరమున్నదని ముఖ్యమంత్రి సూచించారు.