ఐదు రోజులపాటు మెదక్ జిల్లా ఎర్రవల్లిలో తెలంగాణ సీఎం నిర్వహించిన అయుత మహాచండీయాగం దిగ్విజయంగా ముగిసింది. ఈ యాగం చివరి రోజు మరికొన్నిగంటల్లో యాగం ముగుస్తుందన్న సమయంలో ఓ యాగశాలలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. యాగ శాల పై కప్పుకు మంటలు అంటుకున్నాయి.  అగ్నిమాపక సిబ్బంది తక్షణమే స్పందించి వాటిని ఆర్పి వేశారు. 

ఐతే.. తొలి నాలుగు రోజులు బ్రహ్మాండంగా సాగిన యజ్ఞంలో చివరి రోజు అపశ్రుతి జరగడంపై అనేక కథనాలు వినిపిస్తున్నాయి. యజ్ఞయాగాదులంటేనే నమ్మకాలు, విశ్వాసాల సమాహారం.. అందుకే విశ్వాసాల యాంగిల్లోనూ పుకార్లు రాజ్యమేలుతున్నాయి. చివరి రోజు చంద్రబాబు అడుగు పెట్టి వెళ్లిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగిందని.. అది చంద్రబాబు లెగ్గు మహిమేనని కొందరు ఆయన వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు అడుగు పెడితే విపత్తులే అన్న పాత నానుడిని గుర్తు చేస్తున్నారు.

మరికొందరు ఇంకో వాదన వినిపిస్తున్నారు. ఈ యాగానికి ప్రణబ్ ముఖర్జీ రావాల్సి ఉంది. ఆయన వచ్చారు కూడా. ఆయన హెలికాప్టర్ గాల్లో ఉండగానే అగ్నిప్రమాదం జరిగింది. దాంతో ఆ హెలికాప్టర్ అటు నుంచి అటే తిరుగు ప్రయాణమైంది. ఇటీవలే ప్రణబ్ ముఖర్జీ సతీమణి మరణించారు. ఈ దుర్ఘటన జరిగి రెండు నెలలు మాత్రమే అయ్యింది. అలాంటి వ్యక్తి యజ్ఞయాగాదులకు రాకూడదట.

అయినా ప్రణబ్ ముఖర్జీ వచ్చేందుకు ప్రయత్నించడం వల్ల అమ్మవారే.. ప్రమాదం ద్వారా ఆయన్ని ఆపేశారని కొందరు చెప్పుకుంటున్నారు. మరికొందరు ఇంకో వాదన వినిపిస్తున్నారు. యజ్ఞం పూర్తి చేసిన తర్వాత యజ్ఞశాలలను కాల్చి వేయాలి. అయుత చండీయాగం ద్వారా అమ్మవారు బాగా సంతృప్తి చెందినందువల్ల ఆమే స్వయంగా యజ్ఞపాకలను అగ్నికి ఆహుతి చేసి తన సంతృప్తికి సంకేతాలు ఇచ్చారని భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: