తెలంగాణ సీఎం ఇటీవల చేసిన ఓ విజ్ఞప్తిపై ప్రధాని నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి వ్యవహారంలో కేసీఆర్ మాటకు మోడీ విలువ ఇవ్వడం చెప్పుకోదగిన పరిణామమే. కేసీఆర్ ఫిర్యాదు మేరకే స్పందించిన మోడీ.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి పదవి నుంచి ఆర్‌కే గుప్తాను కేంద్రం తొలగించింది. 

కృష్ణా జలాల విషయంలో ఇటీవల ఏపీ, తెలంగాణ జగడాల సంగతి తెలిసిందే. ఈ సమయంలో రెండు రాష్ట్రాలకు నచ్చజెప్పి.. ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయాల్సిన ఆర్కే గుప్తా.. ఏకపక్షంగా వ్యవహరించడం వల్లే ఆయన తన పదవి కోల్పోయినట్టు తెలుస్తోంది. గుప్తా తీరు వల్లే  వ్యవహార శైలి వల్లే ఏపీ, తెలంగాణ మధ్య వివాదాలు తలెత్తుతున్నాయని తెలంగాణ పలుసార్లు ఆరోపించింది. 


విమర్శించడమే కాదు.. ఏకంగా ఆయన్ను పదవి నుంచి తొలగించాలని కూడా తెలంగాణ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీంతో మోడీ సర్కారు ఆర్కే గుప్తాకు గుడ్ బై చెప్పింది. ఇప్పటికే గోదావరి బోర్డు సభ్య కార్యదర్శిగా ఉన్న సమీర్ ఛటర్జీని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ఇన్నాళ్లూ ఆంధ్రా వాదనలకు అనుకూలంగా వ్యవహరించిన గుప్తా ఉద్వాసన ఆ రాష్ట్రానికి కొంత ఇబ్బంది కలిగించే విషయమే. మరి తాజాగా ఆ పదవిలోకి వచ్చిన ఛటర్జీ వ్యవహారశైలి ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. అయితే గుప్తా ప్రస్తుతం ఈ పదవి నుంచి దూరమైనా.. ఇంకా ఆయన పలు కీలక పదవుల్లో కొనసాగుతుండటం వల్ల ఆయన ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయలేమని నిపుణులు చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: