కొన్ని రోజులుగా మీడియా వార్తల్లో ప్రధానంగా నిలుస్తోంది టిక్ టాక్.. ఈ మధ్య ఇంతగా అలరించిన యాప్ మరొకటి లేదేమో. అదే సమయంలో ఇంతగా కాంట్రావర్సీ అయిన యాప్ కూడా లేదు. జియో రాకతో మొబైల్ డేటా చవగ్గా దొరకడంతో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఓ వ్యసనంగా తయారైంది.


అందులోనూ టిక్ టాక్ వంటి యాప్ లు.. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ ఆకట్టుకుంటున్నాయి. చివరకు టిక్ టాక్ ఓసామాజిక వ్యసనంగా మారడంతో దీన్ని నిషేధించాలన్న డిమాండ్లు కూడా వచ్చాయి. మద్రాసు హైకోర్టు కొన్నాళ్లు నిషేధించింది కూడా. ఇప్పుడు దేశమంతటా ఈ టిక్ టాక్ మాయలోపడి చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యోగాలు పొగొట్టుకుంటున్నారు కూడా.


ఈ నేపథ్యంలో టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డాన్స్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా స్మార్ట్‌ఫోన్ల తయారీ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. ఈ టెక్నాలజీ కోసం స్మార్ట్‌జాన్‌ టెక్నాలజీతో ఒప్పందం కుదుర్చుకుందట. ప్రస్తుతం వీడియో, యాప్స్‌లో దూసుకెళ్తోన్న ఈ సంస్థ కొత్త రంగంలోకి అడుగుపెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.


కేవలం యాప్స్ తోనే ఈ రేంజ్ లో ఊపేస్తున్న బైట్ డాన్స్... ఇప్పుడు స్మార్ట్ ఫోన్ రంగంలో అడుగుపెడితే.. రచ్చ రంబోలా అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. తమ స్మార్ట్ ఫోన్లలో ఈ యాప్ లన్నీ ఇన్‌ బిల్ట్ గా తయారైతే.. ఇక ఆ ఫోన్లు కొన్నవాళ్లు ఈ యాప్ లకు బానిసలు కావడం ఖాయం.


ఇప్పటికే ఈ బైట్ డాన్స్ సంస్థ చైనాలో మంచి టెక్నాలజీ సంస్థగా గుర్తింపు పొందింది. స్మార్ట్ జాన్ సంస్థతో కలసి అద్భుతాలు సృష్టించేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే టిక్ టాక్ గోల తట్టుకోలేకపోతున్నాం.. ఇక ఈ సంస్థ ఏకంగా స్మార్ట్ ఫోన్లు ఉత్పత్తి చేస్తే.. ఇంకెలా ఉంటుందో ఏమో..?


మరింత సమాచారం తెలుసుకోండి: