ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేందుకు రెడీ అయ్యారు. ఇందుకు సంబంధించిన అధ్యయన కమిటీ సీఎం జగన్ కు నివేదిక సమర్పించింది. బుధవారం కేబినెట్ మీటింగ్ లో దీనిపై చర్చించి ఆమోదం తెలపబోతున్నారు. అదే జరిగితే.. ఆర్టీసీ కార్మికుల చిరకాల వాంఛ నెరవేరినట్టే.. వారి ఇళ్లలో దేవుడి ఫోటో పక్కన జగన్ ఫోటో ఖాయం.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని క్లారిటీగా చెప్పేశారు. అంతకుముందు.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ రవాణా శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి అధ్యక్షతన సీఎం వైయస్ జగన్ కమిటీని ఇప్పటికే నియమించింది.
ఆ కమిటీ చైర్మన్ ఆంజనేయరెడ్డి సీఎం వైయస్ జగన్‌కు నివేదిక అందజేసింది. నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు ముఖ్యమంత్రి ఆమోదించారు. ప్రభుత్వం దానిపై బుధవారం నిర్ణయం కూడా తీసుకుంటుంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు అనే డిపార్టుటుమెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆ డిపార్టుమెంట్‌లో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోవడం జరుగుతుంది. మిగిలిన విధి విధానాలన్నీ త్వరలో ఖరారవుతాయి.
దశాబ్దాలుగా ఉద్యోగ భద్రత లేకుండా ఆర్టీసీలో కార్మికులు పనిచేస్తున్నారు. సుదీర్ఘకాలంగా ఉన్న ఆర్టీసీ కార్మికుల కల నెరవేరబోతుంది. ప్రతి సంవత్సరం ఆర్టీసీ మీద ఉన్న జీతభత్యాల భారం సుమారు రూ. 3,300 నుంచి రూ. 3,500 కోట్లు ఉంటోంది. ఇప్పుడు ఆ భారాన్ని వైయస్ జగన్ ప్రభుత్వం తీసుకోబోతుంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, ఆర్టీసీని లాభాలబాట పట్టించేందుకు సీఎం వైయస్ జగన్ ఆలోచన చేస్తున్నారు.