వాళ్లంతా పోలీసులు. విధుల్లో ఉన్నారు. గాంధీ జయంతి, గ్రామ సచివాలయాల లాంటి ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయి. విధుల్లో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. కానీ డ్యూటీకి డుమ్మా కొట్టి సినిమాకు వెళ్లారు. పైగా ఎవరికీ సమాచారం కూడా ఇవ్వలేదు. దీంతో ఆ అధికారులపై యాక్షన్ తీసుకున్నారు ఎస్.పి ఫకీరప్ప.
కర్నూలు జిల్లాలో పోలీస్ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. చేసిన తప్పులు తమ మెడకు ఎప్పుడు చట్టుకుంటాయనే ఆందోళనలో వున్నారు. డ్యూటీకి డుమ్మా కొట్టి సినిమాకు వెళ్లిన 7 గురు ఎస్.ఐ వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు ఎస్.పి ఫకీరప్ప. సినిమాకు వెళ్లడమే కాకుండా థియేటర్‌లో సెల్ఫీ కూడా తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్‌గా మారింది. డ్యూటీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏడుగురు ఎస్.ఐలను వీఆర్‌కు పంపారు.
అసలే గాంధీ జయంతి. పైగా గ్రామ సచివాలయాల ప్రారంభోత్సవం వంటి కార్యక్రమాలు ఉన్నాయి. వీఐపీల కార్యక్రమాలు ఉంటాయి. పోలీసులు విధుల్లో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. అయినప్పటికీ విధుల్లో లేకుండా, ఎలాంటి అనుమతి తీసుకోకుండా సైరా నరసింహారెడ్డి సినిమాకు వెళ్లారు. అవుకు ఎస్.ఐ శ్రీకాంత్ రెడ్డి, కొలిమిగుండ్ల ఎస్.ఐ జగదీశ్వర్ రెడ్డి, నందివర్గం ఎస్.ఐ హరిప్రసాద్, బండి ఆత్మకూర్ ఎస్.ఐ వెంకట సుబ్బయ్య, రాచర్ల ఎస్.ఐ ప్రియతమ్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఎస్.ఐ అశోక్, పూసపాడు ఎస్.ఐ నిరంజన్ రెడ్డి సినిమాకు వెళ్లిన జాబితాలో ఉన్నారు. వీళ్లంతా కోయిలకుంట్లలోని ఓ థియేటర్ లో సినిమాకు వెళ్లారు. దీంతో వారిపై చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు.
పోలీస్ అధికారులపై వచ్చిన ఆరోపణలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు ఎస్పీ ఫకీరప్ప. ఇంతకుముందు కొసిగి మండలంలో పేకట రాయుళ్లను తప్పించి నకిలీలను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ వ్యవహారం బయటికి రావడంతో.. ఎస్పీ ఫకీరప్ప విచారణ జరిపించి ఎస్.ఐ శ్రీనివాసరావు, ముగ్గురు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేయించారు. ఆరోపణలు వస్తే కఠినంగా వ్యవహరించి పనిష్ మెంట్ ఇస్తున్నారు. అనేక కారణలతో ఇప్పటి వరకు 20 మందికి పైగా సి.ఐ, ఎస్.ఐలను వీఆర్‌కు పంపారు. కొందరిని సస్పెండ్ చేశారు ఎస్.పి. ఫకీరప్ప.