సైనేడ్ కిల్లర్ సింహాద్రిపై విజయవాడలో మరో కేసు నమోదైంది. 2018 సంవత్సరంలో గండికోట భాస్కరరావు అనే వ్యక్తి అనుమానాస్పద మృతి చెందాడు. సింహాద్రి తన భర్తతో పూజలు చేయించి హత్య చేశాడని భాస్కరరావు భార్య బెజవాడ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. తన భర్త మృతి సమయంలో రెండున్నర లక్షల రూపాయల నగదు, 9 కాసుల బంగారం మాయమైందని సింహాద్రి తన భర్తను హత్య చేశాడని భాస్కర రావు భార్య కేసు నమోదు చేసింది.
సింహాద్రి పది మందిని సైనేడ్ ఇచ్చి హత్య చేశాడు. ఈ హత్యలలో భాస్కరరావుది నాలుగవ హత్య అని సమాచారం. కొద్దిరోజుల క్రితం పోలీసులు సింహాద్రిని అరెస్ట్ చేశారు. మొదట గండికోట భాస్కరరావు కుటుంబ సభ్యులు భాస్కరరావు సహజంగానే మరణించాడని అనుకున్నారు. భాస్కరరావు మృతి గురించి ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. తన భర్త చనిపోయిన రోజు నగదు. బంగారం మాయమవటం, అంతకు ముందు ఒక స్నేహితుడు బంగారంతో పూజలు చేస్తే కలిసి వస్తుందని చెప్పాడని తన భర్త చెప్పింది గుర్తుకురావటంతో అతను సింహాద్రినే అని భాస్కరరావు భార్య ఫిర్యాదు చేశారు.
కొన్ని రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లాలో సైనేడ్ కిల్లర్ సింహాద్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుప్తనిధులు, రంగు రాళ్ల పేరుతో సింహాద్రి పలు ప్రాంతాలలో మోసాలకు పాల్పడి 28 లక్షల రూపాయల నగదు కాజేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. సింహాద్రి సైనేడ్ తో ఎక్కువగా తన సొంత బంధువులనే హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. సింహాద్రికి సైనేడ్ సరఫరా చేసిన షేక్ అమీనుల్లాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు సింహాద్రి దగ్గర నుండి లక్షా 63 వేల రూపాయల నగదు, 23 కాసుల బంగారం, సైనేడ్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో సింహాద్రి కృష్ణా జిల్లా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరికి చెందిన పది మందిని హత్య చేసినట్లు తేలింది.