తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్ లోని ఒక వాహనం ప్రమాదానికి గురైంది. అర్ధరాత్రి జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం చీటూరు గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పూర్ణ, పార్థసారథి మృతి చెందారు. మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్ నుండి పాలకుర్తి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాన్వాయ్ లో ఎర్రబెల్లి వెనకే వస్తున్న వాహనం ఒకటి అదుపుతప్పి బోల్తా పడింది. 
 
ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా అటెండర్ తాతారావు, శివ, గన్ మెన్ నరేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. జనగామ జిల్లా ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించి చికిత్స అందించారు. మంత్రి ఎర్రబెల్లి క్షేమంగా ఉన్నారు. హైదరాబాద్ నుండి పాలకుర్తికి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనటం కొరకు ఎర్రబెల్లి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మృతి చెందిన వారిని జనగామ జిల్లా మార్చురీకి తరలించారు. 
 
మంత్రి ఎర్రబెల్లి ఆస్పత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శిస్తున్నారు. మంత్రి మరో కారులో ప్రయాణిస్తూ ఉండటంతో మంత్రి పెను ప్రమాదం తప్పింది. మంత్రి క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. తన దగ్గర పని చేసే సిబ్బంది పూర్ణ, పార్థసారథి మృతి చెందడంతో మంత్రి కన్నీటిపర్యంతమయ్యారు.మెరుగైన వైద్య చికిత్స కొరకు క్షతగాత్రులను హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. 
 
అప్పటివరకు తనతోనే ఉన్న సిబ్బందిలో ఇద్దరు మృతి చెందడంతో మంత్రి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో జనగామ జిల్లా దేవరుప్పర మండలం దగ్గర ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రయాణిస్తున్న కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. కాన్వాయ్ లోని ఒక కారు మరొక కారును ఢీ కొట్టడంతో  ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో మంత్రి ఎర్రబెల్లికి ఎలాంటి గాయాలు కాలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: