బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఏపీ సమగ్రాభివృద్ధిపై తమ నివేదికను ప్రభుత్వానికి అందజేసిన నేపథ్యంలో తమ నివేదికలోని విషయాలను వెల్లడించింది. బీసీజీ గ్రూప్ సభ్యుడు విజయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ను ఆరు ప్రాంతాలుగా గుర్తించి అభివృద్ధిపై దృష్టి సారించాలని కమిటీ అధ్యయనం చేసిందని తెలిపారు. 13 జిల్లాలను ఆరు ప్రాంతాలుగా విభజించి ఆరు ప్రాంతాలలో వనరులను, అభివృద్ధికి ఆటంకాలను, సమస్యలకు పరిష్కారాలను కమిటీ పరిశీలించిందని చెప్పారు. 
 
బీసీజీ కమిటీ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పర్యటించిందని అన్నారు. 2 లక్షల కోట్ల రూపాయల అప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉందని విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇబ్బందిగా ఉందని విజయ్ కుమార్ అన్నారు. పోర్టులు విశాఖలో తప్ప ఎక్కడా అభివృద్ధి చెందలేదని విశాఖలోమాత్రమే అంతర్జాతీయ విమాన ప్రయాణికులు ఉన్నారని విజయ్ కుమార్ పేర్కొన్నారు. 
 
ఆర్థిక వ్యవస్థకు విదేశీ పర్యాటకుల వలన మేలు జరుగుతుందని విజయ్ కుమార్ చెప్పారు. మెడికల్ హబ్ గా ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయవచ్చని కమిటీ తమ నివేదికలో పేర్కొందని అన్నారు. వాటర్ గ్రిడ్, రోడ్ గ్రిడ్, బ్యాక్ వాటర్ టూరిజంతో పాటు పోలవరం, ప్లాస్టిక్ మరియు గ్యాస్ రంగాల్లో పరిశ్రమలు గోదావరి డెల్టాలో అభివృద్ధి చేయవచ్చని అన్నారు. ఎడ్యుకేషన్ హబ్ గా కృష్ణా జిల్లాను తీర్చిదిద్దవచ్చని తెలిపారు. 
 
మైపాడు, మచిలీపట్నం బీచ్ లను అభివృద్ధి చేయాలని కమిటీ సూచించిందని అన్నారు. టమాటా పంటకు కోల్డ్ స్టోరేజీలు చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయాలని ఎలక్ట్రానిక్ పరిశ్రమలు తిరుపతిలో ప్రోత్సహించాలని కమిటీ తన నివేదికలో పేర్కొందని అన్నారు. ఆటోమొబైల్ లాజిస్టిక్ హబ్ కు కర్నూలు - అనంతపురం ప్రాంతంలో అవకాశం ఉందని విజయ్ కుమార్ వివరించారు. వ్యవసాయం విషయంలో చాలా అసమతుల్యత ఉన్నట్టు విజయ్ కుమార్ చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి ప్రకృతి సంపద ఉన్నప్పటికీ సరిగా వినియోగించుకోవటం లేదని స్పష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: