రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు నదిలో బోల్తా పడటంతో 24 మంది మృతి చెందారు. ఈరోజు ఉదయం బూండీలోని కోటలాల్‌సోట్ మెగా హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అధికారులు పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న బస్సు ప్రమాదవశాత్తు నదిలో పడిందని చెబుతున్నారు. అధికారులు నీటి ప్రవాహంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
కోటా నుంచి సవాయ్‌మాధోపూర్ కు పెళ్లి వేడుక నిమిత్తం వరుడి కుటుంబం, బంధువులతో వెళుతున్న బస్సు బ్రిడ్జిపై నుండి అదుపు తప్పి నదిలో పడింది. ప్రమాదం జరిగిన బస్సులో 40మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వలనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం ఇప్పటివరకు 24 మంది మృతి చెందారు. 
 
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. స్థానికులు ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి ప్రయాణికులను రక్షించే ప్రయత్నాలు చేశారు. పోలీసులు సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సు వేగంగా నడపటంతో నియంత్రణ కోల్పోయి ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఉదయం పది గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 
 
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. గతంలో రాజస్థాన్ లోని దుబిలో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. 2017 సంవత్సరం డిసెంబర్ లో బస్సు బ్రిడ్జి మీద నుండి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా 24 మంది గాయపడ్డారు.                          

మరింత సమాచారం తెలుసుకోండి: