ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానుండడంతో పార్టీలో ఆ రెండు స్థానాలకు విపరీతమైన పోటీ నెలకొంది. రాజ్యసభ రేసులో కె కేశవరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత, హెటిరో సంస్థల అధినేత పార్థసారథి రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, మందా జగన్నాథం, ప్రొఫెసర్ సీతారాం నాయక్, మండవ వెంకటేశ్వర రావు, స్పీకర్ మధుసూదనాచారి ఉన్నారు.
సీఎం కేసీఆర్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ వర్గాలు దాదాపు వీరిద్దరే ఖరారయ్యాయని చెబుతున్నాయి. కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకొని ఈ ఇద్దరు నేతలకు చెప్పినట్లు సమాచారం. కేకే, పొంగులేటి మాత్రం తమ పేర్లనే ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నా అధికారికంగా ఎలాంటి సమాచారం తమకు అందలేదని చెబుతున్నారు.
రాజ్యసభ నామినేషన్లు వేసేందుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. నేతలు శుక్రవారంలోగా నామినేషన్లు వేయాల్సి ఉంది. టీఆర్ఎస్ పార్టీలో రాజ్యసభ స్థానాల కోసం ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య భారీగా ఉంది. కానీ కేసీఆర్ మాత్రం వీరిద్దరి వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. అధికారికంగా టీఆర్ఎస్ పార్టీ నుండి ఈ మేరకు ప్రకటన రావాల్సి ఉంది.
ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం కేసీఆర్ వీరిద్దరి పేర్లను ప్రకటించనున్నారని తెలుస్తోంది. సీఎం వీరితో పాటు నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా స్థానానికి నామినేషన్లను ఈరోజు నుండి స్వీకరించనుండటంతో కొన్ని పేర్లను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. కేసీఆర్ నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా అభ్యర్థిగా మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, గవర్నర్ కోటా అభ్యర్థిగా సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ పేర్లను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.