స్థానిక ఎన్నికల్లో వైసీపీ పెద్ద ఎత్తున అరాచకం చేస్తోందని టీడీపీ ప్రచారం చేస్తోంది. ఇదే విషయాన్ని టీడీపీ నాయకులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. అసలు వైసీపీ వాళ్లు నామినేషన్లు వేయ నీయడం లేదని.. దాడులు చేస్తున్నారని... చెబుతున్నారు. అయితే ఈ విషయంపై మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. స్థానిక ఎన్నికలలో పెద్ద ఎత్తున నామినేషన్ లు దాఖలు అయ్యాయని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.
వాస్తవానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చెబుతున్నట్లు నామినేషన్ లను వైసిపి కార్యకర్తలు అడ్డుకుంటే ఆ పార్టీ తరపున 18వేల మంది నామినేషన్ లు ఎలా వేశారని మంత్రి బొత్స ప్రశ్నించారు. అందిన వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 9 తొమ్మిది వేలకు పైగా ఎంపీటీసీ పోస్టులకు వైసిపి నుంచి 23 వేల మంది, టిడిపి నుంచి 18వేల మంది, జనసేన నుంచి రెండువేల మంది, బిజెపి పక్షాన 1800 నామినేషన్లు వేశారని మంత్రి బొత్స తెలిపారు. ఇన్నివేల మంది నామినేషన్లు వస్తే చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స అన్నారు.
ఇదే సమయంలో మంత్రి బొత్స పాత విషయాలను గుర్తు చేశారు. గతంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో ముప్పాళ్ల మండలంలో ఎంపీటీసీలను తీసుకు వెళుతున్న అంబటి రాంబాబును టిడిపి నేతలు అడ్డుపడిన విషయం మర్చిపోయారా అని ఆయన అన్నారు. కాని తాము అలాంటి పనులు ఎక్కడా చేయలేదని మంత్రి బొత్స అన్నారు. అధికారం కోల్పోయిన తరువాత చంద్రబాబు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు. నీ బెదిరింపులకు ఎవరూ భయపడరని మంత్రి బొత్స అన్నారు.
ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా తీసుకెళ్లావు. ఈ రోజు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీలో చేరాల్సి వస్తే ఒక విధానం రూపొందించాం. రాజీనామా చేసి రమ్మంటున్నాం. దానికే కట్టుబడి ఉంటున్నామన్నారు మంత్రి బొత్స.