ప్రధాని మోదీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో జనతా కర్ఫ్యూ ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమైంది. ప్రధాన రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తుండగా రోడ్లపై అతి తక్కువ సంఖ్యలో వాహనాలు తిరుగుతున్నాయి. కర్ఫ్యూ నుంచి ప్రభుత్వం పెట్రోల్ బంకులకు, పాల డిపోలకు మాత్రం మినహాయింపును ఇచ్చింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అత్యవసర సేవల కోసం ప్రభుత్వం ప్రతి డిపోలో 5 ఎమర్జెన్సీ బస్సులను అందుబాటులో ఉంచింది. 
 
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రజలు బయటకు వచ్చి చప్పట్లు కొట్టాలన్న మోదీ నిర్ణయాన్ని కేసీఆర్ ప్రశంసించారు. ప్రధాని పిలుపునకు సీఎం పూర్తి మద్దతు ప్రకటించారు. నిన్న కేసీఆర్ ప్రజలంతా 24 గంటలు కర్ఫ్యూ విధించుకుంటే కరోనా మహమ్మారి రాష్ట్రం విడిచిపెట్టిపోవాలని అన్నారు. 
 
రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండటం, ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునివ్వడంతో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ జిల్లా మంథని గ్రామస్థులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గ్రామంలో ఎవరైనా ఇంటి నుంచి బయటకు వస్తే 1000 రూపాయల జరిమానా విధించనున్నారు. 
 
మంథని గ్రామాభిమృద్ధి కమిటీ ఈ మేరకు ప్రకటన చేసింది. గ్రామంలోని ప్రజలందరూ కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఇంటికే పరిమితం కావాలని కమిటీ సూచించింది. రాష్ట్రంలో నిన్నటివరకూ 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కఠిన నిర్ణయాలను అమలు చేస్తోంది. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో నిఘా బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రానికి వస్తున్న విదేశీయుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 11,000 మంది విదేశీయులు ప్రభుత్వం అదుపులో ఉన్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: