ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలొ నిన్న కొత్తగా 60 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 1463కు చేరింది. ఇప్పటివరకు 33 మంది కరోనా భారీన పడి మృతి చెందారు.
తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఒకరు కరోనా బాధితులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా భారీన పడి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం చేసి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో క్వారంటైన్ కు వెళ్లొచ్చిన వారికి 3,000 రూపాయలు, ఐసోలేషన్ కు వెళ్లొస్తే 10,000 రూపాయలు ఇస్తానని ప్రకటన చేశారు.
తాను వ్యక్తిగతంగా ఈ సహాయం చేస్తున్నానని కరోనా బాధితులకు వైద్యం, పోషకాహారం, ఇతర ఖర్చులకు తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. మరోవైపు కేంద్రం రాష్ట్రంలో రెడ్ జోన్ల సంఖ్యను తగ్గించింది. గతవారం 11 జిల్లాలను రెడ్ జోన్లుగా ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా ఐదు జిల్లాలను మాత్రమే రెడ్ జోన్లుగా ప్రకటించింది.
రాష్ట్రంలో తాజా వర్గీకరణ రేపటినుంచి అమలులోకి రానుంది. కేంద్రం దేశవ్యాప్తంగా 130 జిల్లాలను రెడ్ జోన్లుగా ప్రకటించింది. మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య 35,000 దాటింది. ఇప్పటివరకు 1142 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్నా ఏపీలో వైరస్ విజృంభిస్తూనే ఉంది. ఏపీలో నిన్నటివరకు 1463 కరోనా కేసులు నమోదు కాగా కర్నూలు జిల్లాలోనే 411 కేసులు నమోదయ్యాయి.