మీడియా అంటేనే ప్రజాపక్షం.. అలా ఉంటేనే మీడియాకు విశ్వసనీయత ఉంటుంది. ప్రజాపక్షం అంటే సమాజంలోని అవలక్షణాలను కడిగిపారేయడమే కదా. మీడియా ఎంతగా ఆ పని చేస్తే.. ఆ మీడియాపై జనం అభిమానం పెంచుకుంటారు. అందుకే సహజంగా మీడియా సంస్థలు ఎప్పుడూ అవినీతిని అడ్డుకుంటాం.. సమాజాన్ని రక్షిస్తాం అంటూ ప్రచారం చేసుకుంటాయి. ట్యాగ్ లైన్లు పెట్టుకుంటాయి. తద్వారా ప్రజావిశ్వాసం పొందే ప్రయత్నం చేస్తాయి.

 

 

అయితే అచ్చెన్నాయుడి అరెస్టు సందర్భంగా మాత్రం తెలుగు దేశం అనుకూల మీడియా ఈ ధోరణిని పక్కకు పెట్టేసింది. అచ్చెన్నాయుడి అరెస్టు విషయంలో ఈ ప్రాథమిక సూత్రాల్ని సైతం మరచిపోయింది. అచ్చెన్నాయుడిని అరెస్టు చేసింది ఎందుకు..? ఈఎస్‌ ఐ మందుల కుంభకోణంలో కోట్లు మిగేశాడనే కదా.. ఈఎస్‌ఐ అంటే ఏంటో మీడియాకు తెలియంది కాదు. చిన్నాచితకా ఉద్యోగాలు చేసుకునే వారి జీతాల నుంచి కోసేసిన సొమ్ముతో వారికి వైద్య సాయం అందించే సంస్థ.. అది ఎంత ముఖ్యమో ఈ మీడియాకు బాగా తెలుసు. ఎందుకంటే ఈ సంస్థలు కూడా తమ ఉద్యోగుల జీతం నుంచి ఈఎస్‌ఐ సొమ్ము కోసేస్తాయి కనుక.

 

 

మరి అలాంటి సంస్థలో మందుల విషయంలో కక్కుర్తి పడటం అంటే.. బడుగు ఉద్యోగుల రక్తం పీల్చడమే. సాధారణంగా సీబీఐ, ఏసీబీ విచారణల సమయంలో మీడియా కాస్త అతి చేస్తుంటుంది. ఆయా మీడియా సంస్థల వద్ద సమాచారం తీసుకుని తామే ముందుగా ఆ అవినీతి గురించి కథలు కథలుగా రాసేస్తాయి. తామే తీర్పు చెప్పేస్తాయి. జగన్ వంటి ఎందరో నాయకుల విషయంలో మనం ఇది చూశాం.

 

 

కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అరెస్టు అయ్యింది తెలుగుదేశం నేత కావడంతో అవినీతిని సైతం సపోర్ట్ చేసే స్థాయికి పసుపు మీడియా వెళ్లిపోయింది. అలా ఎలా అరెస్టు చేస్తారు.? గోడ దూకి అరెస్టు చేస్తారా..? మందులు వేసుకోనివ్వరా..? విజిలెన్సు రిపోర్టులో పేరు లేకపోయినా అరెస్టు చేస్తారా? అంటూ పసుపు మీడియా గుండెలు బాదుకోవడం చూస్తే.. అవినీతిపై పోరాటం అంటే ఇదేనా ? అంటూ జనం ముక్కున వేలేసుకునే పరిస్థితి కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: