దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదకరస్థాయిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య పెరుగుతోంది. మార్చిలో పదుల సంఖ్యలో కేసులు నమోదు కాగా ప్రస్తుతం వేలల్లో నమోదవుతున్నాయి. కేసులు భారీగా నమోదవుతూ ఉండటంతో ప్రజల్లో భయాందోళన అంతకంతకూ పెరుగుతోంది. మరికొన్ని రోజుల్లో కేసుల సంఖ్య ఊహించని రీతిలో పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కరోనాకు మందులొచ్చాయని చాలామంది భావిస్తున్నారు. కానీ ఈ మందులు కొత్తవేం కాదు. గతంలో కూడా కరోనా రోగుల లక్షణాలను బట్టి వైద్యులు మందులు ఇచ్చారు. అంతే తప్ప కరోనాను పూర్తిగా నయం చేసే మందులు ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. మరోవైపు కేసులు ఎందుకు పెరుగుతున్నాయనే ప్రశ్నకు మూడు రకాల కారణాలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మొదట్లో జమాత్ సదస్సుకు హాజరైనవారు, వలస కార్మికుల ద్వారా వైరస్ వేగంగా వ్యాప్తి చెందింది.
అధికారులు వారిని గుర్తించే లోపే వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందింది. కరోనా వ్యాప్తి చెందడానికి కరోనా చికిత్స చేసే ఆస్పత్రులు లేకపోవడం మరో కారణం. ఆస్పత్రుల్లో తగినన్ని బెడ్లు లేకపోవడంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు హోం క్వారంటైన్ లో ఉండాలని సూచిస్తున్నాయి. మరికొంతమందికి ఆలస్యంగా పరీక్షలు చేస్తూ ఉండటంతో వారి వల్ల ఇతరులకు కరోనా సోకుతుంది. కొన్ని ప్రాంతాలలో ఆస్పత్రుల్లో చేర్చుకున్న 14 రోజుల తరువాత రోగులకు పరీక్షలు చేయకుండానే ఇంటికి పంపిస్తున్నారు. వీరి వల్ల కూడా వైరస్ వ్యాపిస్తోంది.
దేశీయ విమాన సర్వీసులకు అనుమతులు ఇవ్వడం వల్ల ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రయాణాలు చేసిన వారు ఎక్కువగా వైరస్ భారీన పడుతున్నారు. అందువల్ల వైరస్ ఎక్కడ ఎప్పుడు ఎవరి నుంచి సోకుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉంది. మాస్క్ ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడం లాంటి తప్పులు చేస్తే వైరస్ భారీన పడే అవకాశాలు ఉన్నాయి. ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే వైరస్ భారీన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.