అసలే కరోనాతో జనం ఇబ్బందులు పడతుంటే.. కేంద్రం మాత్రం వరుసగా బ్యాడ్ న్యూస్ లు చెబుతోంది. ఇప్పటికే రోజూ పెట్రో ధరలు పెంచుతూ మంటపెడుతోంది. ఇప్పుడు కొత్తగా ఉద్యోగస్తుల పీఎఫ్ సొమ్ముపై వడ్డీ రేటు తగ్గించాలని నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే.. ఉద్యోగస్తులకు ఆ మేరకు నష్టం వాటిల్లినట్టే.
2019-20 సంవత్సరానికి సంబంధించి ఉద్యోగస్తుల ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.1 శాతానికి కుదించొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది 8.5 శాతంగా ఉంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే.. 6 కోట్ల మంది వరకూ ఉద్యోగస్తులకు నష్టం వాటిల్లుతుంది. గత ఆర్థిక సంవత్సరానికి వడ్డీని 8.5 శాతంగా నిర్ధరిస్తూ మార్చి మొదటివారంలో ప్రకటన వచ్చినా.. ఆర్థిక మంత్రిత్వశాఖ ఇప్పటి వరకూ ఓకే చెప్పలేదు.
ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తేనే.. కేంద్ర కార్మిక శాఖ నోటిఫికేషన్ ఇస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 8.5 వడ్డీ రేటు ఇవ్వడం కష్టమని కేంద్రం భావిస్తోంది. అందుకే దీనిపై ఇంకా ఆలోచనలోనే ఉంది. అందుకే దీన్ని 8.1 వరకూ కుదించాలని ఆలోచిస్తోంది. అయితే కేంద్ర కార్మిక శాఖ ఇప్పటికే ఈపీఎఫ్ కటింగ్ లో ఉద్యోగులు, యాజమాన్యాల వాటాను మూలవేతనంలో 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది.
ఇక ఇప్పుడు వడ్డీ శాతం కూడా తగ్గిస్తే ఉద్యోగస్తులకు మరింత నష్టం జరిగే అవకాశం ఉంది. అసలు ఉద్యోగస్తులకు జీవిత చరమాంకంలో మిగిలేదే ఈ పీఎఫ్ డబ్బు మాత్రమే. నేటి ఆర్థిక పరిస్థితుల్లో ఉద్యోగస్తుల పొదుపు శాతం బాగా పడిపోతోంది. ఆ పీఎఫ్ డబ్బు కూడా కొందరు ఇంటి రుణం కోసమో.. ఇతర అవసరాల కోసం తీసేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదంటున్నారు ఉద్యోగస్తులు.