కేసీఆర్.. తెలంగాణలో తిరుగులేని రాజకీయశక్తి.. చరిష్మాలో ఆయన దరిదాపుల్లోకి వచ్చే నాయకుడు కూడా తెలంగాణలో ఎవరూ లేరు.. కాగడా పెట్టి వెదికినా అలాంటి విపక్ష నేత కానరాడు.. అందుకే తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ కేసీఆర్ దే విజయ బావుటా.. కానీ కొన్ని రోజులుగా కేసీఆర్ సర్కారుపై జనంలో ఆందోళన, వ్యతిరేకత పెరుగుతున్నాయి.
ప్రత్యేకించి కరోనా కంట్రోల్ విషయంలో తెలంగాణ సర్కారు చేతులెత్తేసిందన్న వాదన జనంలోకి బలంగా వ్యాపిస్తోంది. కరోనా వచ్చిన మొదట్లో కేసీఆర్ పారసిట్మాల్ వేసుకుంటే పోతుందంటూ మొదట్లో దాన్ని తేలిగ్గా తీసిపారేసినా.. ఆ తర్వాత సీరియస్ నెస్ అర్థం చేసుకుని రూట్ మార్చేశారు. సమీక్షలు, ప్రెస్ మీట్లు అంటూ హడావిడి చేసి జనంతో శభాష్ అనిపించుకున్నారు. అప్పట్లో కేసీఆర్ కరోనా ప్రెస్ మీట్లకు రేటింగులు కూడా విపరీతంగా వచ్చేవి.
కానీ ఆ తర్వాత తెలంగాణలో కేసులు విపరీతంగా పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వ పర్యవేక్షణ కూడా తగ్గిపోయిందన్న సంకేతాలు జనంలోకి వెళ్తున్నాయి. విస్తృతంగా పరీక్షలు చేయించకపోవడం.. దేశంలోనే అతి తక్కువగా పరీక్షలు చేయిస్తున్న రాష్ట్రంగా పేరు రావడం.. నియంత్రణలు ఎత్తేయడం.. లక్షణాలు ఉంటేనే పరీక్షలు చేయడం.. వంటి చర్యల ద్వారా తెలంగాణలో కరోనాను ప్రభుత్వం కట్టడి చేయడం లేదన్న భావన వ్యాపించింది.
ఇక తాజాగా కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ జనం ముందుకు రాకపోవడం.. ప్రైవేటు ఆసుపత్రుల దందాలు.. విపరీతంగా పెరిగిపోతున్న కరోనా కేసులు.. హైదరాబాద్‌లోనైనా లాక్‌డౌన్ దిశగా నిర్ణయం తీసుకోకపోవడం వంటి చర్యలతో క్రమంగా కేసీఆర్ గ్రాఫ్ పడిపోతోందన్న విశ్లేషణలు వస్తున్నాయి.