74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో సీఎం మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు 6 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కీలక ప్రకటన చేశారు. ఈ ఉద్యోగాలలో ప్రభుత్వ రంగం నుంచి లక్ష ఉద్యోగాలు, ప్రైవేట్ రంగం నుంచి 5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు. సీఎం చేసిన ఈ ప్రకటన పట్ల నిరుద్యోగుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
తమ ప్రభుత్వం ఘర్ ఘర్ రోజ్‌గర్ పథకం ద్వారా 13 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించామని అన్నారు. భూమి లేని రైతులు, కూలీలకు 520 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. కౌలు రైతుల కోసం తమ ప్రభుత్వం త్వరలో కొత్త చట్టాన్ని ప్రవేశ పెడుతున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే మౌలిక సౌకర్యాల కల్పనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు.
మౌలిక సౌకర్యాల కల్పనను అభివృద్ధి పరిచేందుకు రాబోయే రెండు సంవత్సరాలలో 12,000 కోట్ల రూపాయలు కేటాయించనున్నామని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆరోగ్య కార్యకర్తలు ధైర్యంతో సేవలందిస్తున్నారని వారి సేవలను ప్రశంసించారు. అమరీందర్ సింగ్ నిరుద్యోగుల సంక్షేమం కోసం చేసిన ప్రకటన పట్ల ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఛండీగర్ లో కరోనా కేసుల సంఖ్య, మృతుల సంఖ్య పెరుగుతోంది. కరోనా నియంత్రణ కోసం అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది.