ఓవైపు కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న వేళ.. ఆయన ఒక్క ఏడాదిలోనే 5700 కోట్ల రూపాయల వరకూ దానం చేసేశాడు. మహా దాన కర్ణుడని పేరు తెచ్చుకున్నాడు. ఆయనే.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్. వాతావరణ మార్పుల అంశంలో పోరాటానికి ఆయన ఓ ఫండ్ స్థాపించాడు. దాని పేరు బెజోస్ ఎర్త్ ఫండ్.. దీని ద్వారానే ఆయన లాభాపేక్షలేని అనేక సంస్థలకు.. దాదాపు 790 మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చారు. అంటే మన కరెన్నీలో దాదాపు 5700 కోట్ల అన్నమాట.
గతేడాది ఎక్కువ మొత్తం విరాళాలుగా ఇచ్చిన వారి పేర్లతో క్రానికల్ ఆఫ్ ఫిలాంత్రఫీ రూపొందించిన వార్షిక జాబితాలో ఈ అమెరికా దానకర్ణుడు అగ్రస్థానంలో నిలిచారు. మొత్తంగా 2020లో వాతావరణ మార్పుల విభాగంలో బెజోస్ 10 బిలియన్ డాలర్ల మేర వితరణలు చేశాడు. ఈ మేరకు క్రానికల్ ఆఫ్ ఫిలాంత్రఫీ తెలిపింది. మరోవైపు బెజోస్ ఆస్తులు ఏడాదికేడాది పెరుగుతున్నాయి. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం గతేడాదికి బెజోస్ ఆస్తుల విలువ 63శాతం మేర పెరిగి 113 బిలియన్ డాలర్ల నుంచి... 184 బిలియన్ డాలర్లకు చేరింది.
ఒక్క బెజోస్ మాత్రమే కాదు.. వారెన్ బఫెట్, బిల్ గేట్స్ వంటి వారు కూడా బాగా దానం చేస్తారు. ఇక ఇండియాలో టాటాలు, ప్రేమ్‌జీ వంటి వారు ఇలా దానాలు చేస్తున్నా.. ఆ సంఖ్య చాలా తక్కువ. ఆధ్యాత్మిక దేశంగా చెప్పుకునే ఇండియా ఇలాంటి దాన కర్ణులు పెరగాల్సిన అవసరం ఉంది.