కేంద్రం ఎన్నికల చట్టాల సంస్కరణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఇక రాజ్యసభ ఆమోదిస్తే ఇది చట్టం అవుతుంది. రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టం అమల్లోకి వస్తుంది. బోగస్ ఓట్ల కట్టడికి.. ఒక్కొక్కరు రెండు ఓట్లు వేసే ప్రక్రియను అడ్డుకునేందుకు ఇది అత్యవసరం అని కేంద్రం భావిస్తోంది. ఒక విధంగా ఇది మంచిదే.. ఇప్పడు ఒక్కొక్కరి రెండు, మూడు కార్డులు ఉంటున్నాయి. దాన్ని ఇది అరికడుతుంది. అయితే ఈ చట్టం ఉద్దేశ్యం ఇదొక్కటేనా.. ఇంకేమైనా ప్రత్యేక ఉద్దేశాలు ఉన్నాయా..? ఈ విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


మరి ఆ వేరే ఉద్దేశ్యం ఏంటంటే.. ఈ చట్టం ద్వారా జమిలి ఎన్నికలకు కేంద్రం రంగం సిద్దం చేస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ చట్టంతో దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా కేంద్రం ప్రయత్నాలు చేస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జమిలి ఎన్నికలకు ఆటంకంగా ఉన్నాయని భావిస్తున్న పలు సమస్యల్ని ఈ చట్టంతో పరిష్కరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందట. ఈ చట్టం అమలులోకి వచ్చేశాక.. జమిలి ఎన్నికలపై ఏ క్షణమైనా కేంద్రం ఓ ప్రకటన చేయవచ్చట.


జమిలి ఎన్నికలు.. మోడీ సర్కారు ఎప్పటి నుంచో ఆలోచిస్తున్న సంస్కరణ ఇది. ఇప్పటికే దీనిపై ప్రధాని మోడీతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా అనేక సార్లు సంకేతాలు ఇచ్చింది. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని ఎన్నికలసంఘంతో పాటు కేంద్రం భావిస్తోందట. ఇప్పుడు  కేంద్రం ప్రకటించిన కొన్ని సంస్కరణలతో పాటు ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలు ఈ వాదనను బలపరుస్తాయని చెబుతున్నారు.


ఇప్పుడు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఒక్కో ఎన్నికలకు ఒక్కో ఓటరు జాబితాను రూపొందిస్తున్నారు. ఇప్పుడు ఈ చట్టంతో అన్ని ఎన్నికలకు ఉపయగపడే విధంగా ఒకే ఓటరు జాబితా సిద్ధం చేస్తారు. ఇకపై ప్రతీ ఏటా జనవరిలో కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసే తాజా ఓటర్ల జాబితాను ఫాలో అయితే జమిలి ఎన్నికలకు అడ్డుగా ఉన్న అనేక సమస్యలు తొలగిపోతాయని కేంద్రం భావిస్తోంది. మొత్తం మీద.. ఈ చట్టం జమిలి ఎన్నికల దిశగా దేశాన్ని నడిపిస్తోందంటున్నారు కొందరు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: