హైదరాబాద్ లోని మణికొండ అల్కాపూర్ వద్ద ఈ శంకుస్థాపన జరిగింది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1200 కోట్లు. దీంతో 978 కాలనీలకు త్రాగు నీరు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. తెలంగాణ ఏర్పాటు కాగానే 2 వేల కోట్లతో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ప్రారంభించామని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ అంటే జీహెచ్‌ఎంసీ ఒక్కటే కాదన్న కేటీఆర్.. ఓఆర్‌ఆర్ లోపల ఉన్న 25 మున్సిపాలిటీలు హైదరాబాద్‌తో కలిసిపోయాయని గుర్తు చేశారు. హైదరాబాద్ నగరం అన్ని నగరాల కంటే వేగంగా విస్తరిస్తోందని కేటీఆర్ అన్నారు.
దేశంలోని మహా నగరాలై ఢిల్లీ, చెన్నై, ముంబయిలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాయన్న కేటీఆర్.. హైదరాబాద్ వాటి కన్నా మిన్నగా ముందుకెళ్తోందన్నారు. 2051 సంవత్సరం నాటికి అవసరమయ్యే వసతుల కల్పన లక్ష్యంగా హైదరాబాద్ మహానగరం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని.. అందుకే ఆరు వేల కోట్లతో మంచినీటి ప్రాజెక్టులు చేపట్టామని కేటీఆర్ అన్నారు.
చెన్నై నగరం ఎదుర్కొంటున్న తాగు నీటి సమస్యలు హైదరాబాద్‌లో తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్ అన్నారు. ఈ ఓఆర్‌ఆర్ ప్రాజెక్టు 2 ద్వారా జలమండలి దాదాపు 1000 కాలనీల్లో రోజు విడిచి రోజు తాగునీటి సరఫరా చేయబోతోంది. దీని ద్వారా మొత్తం 75 రిజర్వాయర్లు నిర్మిస్తారు. 2864 కిలోమీటర్ల పైపు లైన్లు కొత్తగా వేస్తారు. దాదాపు 3 లక్షల కొత్త కనెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఆరున్నర లక్షల మందికి తాగునీరు అందనుంది.