అయితే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుబంధ విభాగంలా పనిచేసిన ఎమ్మార్పీఎస్ ఇప్పుడు బీజేపీకి మద్దతు ప్రకటించింది. వాస్తవానికి ఎమ్మార్పీఎస్ కు గుర్తింపు తీసుకొచ్చి మందకృష్ణ మాదిగను పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబే. కానీ ఆయనకు మాత్రం ఏ పదవి అప్పజెప్పలేదు. ఎమ్మార్పీఎస్ ను అడ్డు పెట్టుకొని మిగతా నాయకులు ఎమ్మెల్యే, మంత్రి పదవులు పొందారు కానీ మందకృష్ణ కు మాత్రం ఎప్పుడు నిరాశే ఎదురైంది. మొదట నుంచి తనకు పదవులు ముఖ్యం కాదని.. వర్గీకరణే తన మొదటి ప్రాధాన్యం అంటూ మందకృష్ణ కూడా చెప్పుకుంటూ వచ్చారు.
ఇటీవల హైదరాబాద్ లో మాదిగల విశ్వరూప సభ పెడితే జనం భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ సభకు ప్రధాని మోదీ హాజరవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా మందకృష్ణను తన సోదరుడు అంటూనే ఆయన చేసే పోరాటానికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. వర్గీకరణకు కమిటీ వేస్తామని హామీని సైతం ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ బీజేపీకి అధికారిక మద్దతు ప్రకటించింది. ఈ మేరకు సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 11శాతం ఉన్న మాదిగలు బీజేపీకి అనుకూలంగా ఓటేయాలని పిలుపునిచ్చారు. అయితే ఈ ఓట్లన్నీ బీజేపీకి గంపగుత్తుగా పడతాయా లేదా చూడాలి. అయితే కిందటిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 7 శాతం ఓట్లు రాగా, ఎంపీ ఎన్నికల్లో 22శాతం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 33శాతం ఓట్లు సాధించింది. ఇప్పుడు ఈ 11శాతం ఓట్లు కూడా పోగైతే ఆ పార్టీకి పెద్ద సానుకూలాంశమే అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో.