టైమింగ్‌.. ఇది సాధార‌ణ వ్య‌క్తుల జీవితాల‌కే కాదు.. రాజ‌కీయాల‌కు , రాజ‌కీయ నేత‌ల‌కు కూడా చాలా ముఖ్యం. స‌రైన స‌మ‌యంలో స‌రైన విధంగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోతే ఇబ్బందులు త‌ప్ప‌వు. ఇంట‌ర్వ్యూకు హాజ‌ర‌వ్వాల్సిన అభ్య‌ర్థి ఒక్క నిముషం ఆల‌స్య‌మైనా.. ఉద్యోగానికి అన‌ర్హుడు అవుతాడు. 10 ఏళ్ల‌పాటు క‌ష్ట‌ప‌డి చ‌దివిన చ‌దువు కూడా బూడిద‌లో పోసిన‌ట్టే అయిపోతుంది. ఇది ఒక వ్య‌క్తికి ప‌రిమితం. అలానే రాజ‌కీయ నాయ‌కుల‌కు కూడా.


అయితే.. రాజ‌కీయాల‌కు వ‌చ్చే స‌రికి వ్య‌క్తులు కాదు.. వ్య‌వ‌స్థ‌లే కుప్ప‌కూలే ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. ఇటీవ‌ల జ‌రిగిన ఓ స‌ర్వేలో ఒక రాజ‌కీయ పార్టీచిన్న‌దైనా పెద్ద‌దైనా.. దానిని న‌మ్ముకుని ల‌క్ష‌ల మంది జీవిస్తున్నార‌ట‌. అదే పెద్ద‌ద‌యితే.. ఈ సంఖ్య కోట్లలోనే ఉంటుంద‌ని అంటున్నారు. కాబ‌ట్టి రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులు మ‌రింత జాగ్ర‌త్త‌గా అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాలి. ఈ విష‌యం ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే.. వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతోనే.


వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. పొత్తుల‌కు వెనుకాడారు. సీనియ‌ర్ నాయ‌కులు చెప్పిన సూచ‌న‌లు కూ డా పాటించ‌లేదు. బీజేపీ పొత్తు కోసం ప్ర‌య‌త్నించింది. ఈ విష‌యాన్ని సాక్షాత్తూ హోం మంత్రి అమిత్ షానే చెప్పుకొచ్చారు. కానీ, జ‌గ‌న్ చేతులు చాచ‌లేదు. ఇక‌, ఎన్నిక‌ల‌కు ముందు మేనిఫెస్టోను మురిపించా ల‌ని నాయ‌కులు నెత్తీనోరూ మొత్తుకున్నారు. కానీ, జ‌గ‌న్ ఆదిశ‌గా అడుగులు వేయ‌లేదు. మ‌రికొంద‌రు సీనియ‌ర్లు వ‌చ్చే ఉప‌ద్ర‌వాన్ని ముందే ఊహించారు.


ఈ క్ర‌మంలో చెత్త‌ప‌న్ను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటివాటిని ర‌ద్దు చేయాల‌ని జ‌గ‌న్‌కు సూచించారు. అయినా.. ఆయ‌న పట్టించుకోలేదు. ఇక‌, ఇప్పుడు వాటి గురించే మాట్లాడుతున్నారు. త‌ప్పు చేశామ‌ని అన‌క‌పోయినా.. ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది పెట్టిన వాటిని వెన‌క్కి తీసుకుని ఉండాల్సింద‌ని వ్యాఖ్యానించారు. అదేస‌మ‌యంలో స‌భ‌కు వెళ్ల‌కుండా ఇప్పుడు పెద్ద త‌ప్పు చేస్తున్నారు. మీడియా ముందు ఎంత గొంతు చించుకున్నా.. అది రికార్డుల్లోకి అయితే ఎక్క‌దు క‌దా! సో.. ఏదైనా టైమింగ్ మిస్స‌యితే.. ఇలానే ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని జ‌గ‌న్ అడుగులు వేస్తేనే ఫ‌లితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: