గత కొద్ది నెలలుగా నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ పరిధిలో ఇథనాల్ ఫ్యాక్టరీపై రాద్ధాంతం నడుస్తూనే ఉంది. ఇటీవల అక్కడి ప్రజలు తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశారు.  నిరసనకారులకు నచ్చచెప్పేందుకు వచ్చిన ఆర్డీవోను సైతం వారు ముట్టడించారు.  చివరకు వీరి ఆందోళనకు ప్రభుత్వం దిగివచ్చింది.  ఫ్యాక్టరీ పనులను నిలిపివేయాలంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఆ వివాదం సద్దుమణిగింది.


ఇథనాల్ ఫ్యాక్టరీపై కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన విషయాలు బయటపెట్టింది.  ఒకవిధంగా చెప్పాలంటే కేసీఆర్ బండారాన్ని పూర్తిగా నడిరోడ్డుపై వేసింది. తాజాగా.. ఈ ఫ్యాక్టరీ వివాదం మరోమలుపు తిరిగింది. ఫ్యాక్టరీ ఏర్పాటుకు అన్ని అనుమతులు సైతం బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.  ఈ పరిశ్రమల ఏర్పాటు వెనుక మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నట్లు అందులో ఆయన పేరు ఉందని డాక్యుమెంట్లను రిలీజ్ చేసింది.   దాని ద్వారా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరో తప్పిదాన్ని ప్రజలకు వివరించింది. దిలావర్‌పూర్ ఫ్యాక్టరీ పాపం బీఆర్ఎస్‌దేనన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్లాన్ చేసింది.



ఈ ఫ్యాక్టరీ విషయంలో మంత్రి సీతక్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు.  బీఆర్ఎస్ హయాంలోనే ఆ ఫ్యాక్టరీకి అన్నిరకాల అనుమతులు ఇచ్చారని చెప్పుకొచ్చారు. తాజాగా.. ప్రభుత్వం నుంచి ఈ డాక్యుమెంట్లు రిలీజ్ కావడంతో బీఆర్ఎస్ మరింత ఇరుకున పడినట్లుయింది. దీనిపై గగ్గోలు పెట్టిన బీఆర్ఎస్ టీం ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  

స్థానిక గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ నుంచి ఎన్ఓసీ తీసుకోకుండా ఫ్యాక్టరీ నిర్మాణానికి లైన్ క్లియర్ చేశారని పేర్కొంది.  ఇందులో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం కూడా ఉందని చెబుతూ అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను బయట పెట్టింది. దీంతో ఇప్పుడు ఈ ఇష్యూ మరింత సంచలనంగా మారింది.  మరోవైపు.. కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న ఓ కీలక నేత కుటుంబానికి లబ్ధి చేకూర్చేందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనలు తుంగలో తొక్కి ఈ నిర్ణయం చేసిందని ఆరోపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs