ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఏపిలో ప్రకృతి వైపరిత్యాలు వస్తాయని..ముఖ్యంగా విభజన సమయంలోనే తిత్లీ లాంటి విపత్తుల గురించి తాను హెచ్చరించానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అందుకోసమే తీరప్రాంతం ఉన్నరాష్ట్రాన్ని ఆదుకోవాలనీ, అందుకు ఇతోధికంగా నిధులు ఇవ్వాల్సిందిగా తాను కోరానని వెల్లడించారు. కానీ కేంద్రం మాత్రం ఈ విషయంలో పెద్దగా పట్టించుకోకుండా ఉండటం బాధాకరం అనిపించింది. రోజు అమరావతిలో నీరు-ప్రగతి పథకం అమలు పురోగతిని చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..తీరప్రాంతం కారణంగా తుపాన్లు, తరచూ కరువు పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడుతున్నట్లు తాను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లానని చంద్రబాబు తెలిపారు. అయితే కేంద్రం ఏమాత్రం పట్టించుకోకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తమను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని కోరానన్నారు.
కానీ ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని..తిత్లీ తుపానుతో పాటు కరువు కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకుంటున్నామని చంద్రబాబు అన్నారు. వనరులు, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం విషయంలో తమ ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదన్నారు. గత నాలుగేళ్లలో రెండు తుపాన్లతో పాటు రెండేళ్ల పాటు కరువును రాష్ట్రం ఎదుర్కొందని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు.