
సినీనటుడు ప్రభాస్ తో తనకు సంబంధం ఉందంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ వైఎస్ జగన్ చెల్లెలు షర్మిల మరోసారి హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడం మరోసారి రాజకీయ దుమారానికి దారి తీస్తోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనే తనపై మళ్లీ దుష్ప్రచారం చేస్తున్నారని షర్మిల అంటున్నారు. ఐతే.. దీనికి టీడీపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది.
షర్మిలపై అసభ్య పోస్టింగ్ లకు తమకు సంబంధం లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. షర్మిలపై సోషల్ మీడియాలో పోస్టింగ్ లను ఖండిస్తున్నామని వారంటున్నారు. అలా చేసినవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూనే వైసీపీని టార్గెట్ చేసే పనిలో పడ్డారు. మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లడే షర్మిల ముందు తన అన్నను నిలదీయాలని మంత్రి పరిటాల సునీత అన్నారు.
జగన్ కారణంగా మహిళ ఐఏఎస్లు జైలుపాలయ్యారని.. ఈ విషయంపై తన అన్ను షర్మిల ప్రశ్నించాలని సూచించారు. ఆంధ్ర పోలీసులపై నమ్మకం లేదని చెపుతూ తెలంగాణలో ఫిర్యాదు చేయడాన్ని కూడా టీడీపీ తప్పుబడుతోంది. ఏపీలో పోలీసులపై నమ్మకం లేని అన్నాచెల్లెళ్లకు ఇక్కడ ఓట్లు అడిగే హక్కు ఎలా ఉంటుంది అంటూ లా పాయంట్ లాగుతోంది.
ఎవరో సైకోలు చేసిన పనికి షర్మిల చంద్రబాబుపై ఆరోపణలు చేయటం సరి కాదని ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ అన్నారు. షర్మిల ఫిర్యాదు వ్యవహారం మరోసారి ఇంటర్నెట్లో ట్రోలింగ్ అంశంపై చర్చకు దారి తీసింది. అంతర్జాలంలో దూరి బురదజల్లేవారిని ఎలా దారికి తేవాలన్న అంశంపై చర్చ జరిగేలా చేస్తోంది.