శ్రీకాళహస్తిలోని వాయులింగం క్షేత్రంలో వెలసిన జ్ఞానప్రసూనాంబ అమ్మవారు ఇంద్రునికే జ్ఞానం ప్రసాదించిన దేవతగా ప్రతీతి. అంతేకాదు ఈ ఆలయంలో భక్తుల కోరికలను విని వారిని అనుగ్రహించేందుకు ఓ వైపు తల వాల్చి ఉంది. ఇది ఎంతో ప్రత్యేకం. ఇక్కడ వాయులింగేశ్వరుడు నవగ్రహ కవచం ధరించి ఉన్నాడు. నవగ్రహాల అధినేత ఆధీనంలో ఉంచుకున్న శివుడు ఇలా నవ గ్రహాలను ధరించి ఉన్నాడని చెబుతారు. ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా కన్నుల పండుగగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో ఆ శివుని పరమ భక్తుడైన భక్త కన్నప్పకు మొదటి పూజలు చేయడం ఆచారంగా వస్తోంది.
ఈ పుణ్యక్షేత్రంలో పాతాళ వినాయకుడు మరో అద్భుతం. ఇక్కడ పాతాళంలో వినాయకుడు కొలువై ఉంటాడు. ఇక్కడ వినాయకుడిని దర్శించుకోవాలంటే కేవలం ఒక్కరు మాత్రమే వెళ్లగలిగే అంతటి సన్నని గుహ నుండి మాత్రమే వెళ్ళాలి. ఈ పుణ్య క్షేత్రంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి మొదట పాతాళ వినాయకుడి దర్శనం చేసుకున్న తర్వాతనే శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకోవడం మంచిది. ఇక్కడ ఆదిదేవుడు వినాయకుడిని మొదటగా దర్శించుకోవాలి అన్నది ఇక్కడ విశేషం. ఇలా ఎన్నో విశేషాలు ఈ పుణ్యక్షేత్రం గురించి ప్రాచుర్యంలో ఉన్నాయి.