అండర్ - 19 వరల్డ్ కప్ సెమీస్‌లో భారత్ VS పాకిస్థాన్.
సౌతాఫ్రికా దేశంలో జరుగుతున్న అండర్-19 వన్డే ప్రపంచకప్ చివరి దశకు చేరుకుంది. మొత్తానికి 4 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లు ముగియడంతో సెమీస్ లో ఎవరితో ఎవరు పోటీపడతారనే దానిపై ఇప్పుడు ఒక స్పష్టత వచ్చింది. అయితే ఇప్పుడు మన దేశ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో భారత్ ఆడనుంది. క్రితం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై 74 పరుగులతో విజయం సాధించిన భారత్ సెమీస్‌లోకి చేరిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ఆఖరి క్వార్టర్ ఫైనల్లో ఆఫ్గానిస్థాన్ పై గెలిచిన పాకిస్థాన్ సెమీస్ కు చేరుకుంది. అయితే ఈ మ్యాచ్ ఫిబ్రవరి 4న పొచెఫ్ స్ట్రూమ్ లో ఇరుజట్లు తలపడనున్నాయి.
శుక్రవారం నాడు జరిగిన క్వార్టర్స్‌లో అఫ్గనిస్తాన్ పై పాకిస్థాన్ ఆరు వికెట్లతో గెలుపొందింది. బెనోనిలో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గనిస్తాన్ టీం 49.1 ఓవర్లలో కేవలం 189 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ ఫర్హాన్ జాకిల్ (40) టాప్ స్కోరర్ గా నిలిచాడు. అనంతరం లక్ష్య ఛేదనను పాకిస్థాన్ 41.1 ఓవర్లలో 190/4 ఛేదనను ఆడుతూ పాడుతూ పూర్తి చేసింది. మహ్మద్ హురైరా (64) టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ఇక ఈ మెగాటోర్నీలో వరుసగా పదో విజయం సాధించి జోరుమీదున్న భారత్ ను ఆపడం పాకిస్థాన్ కు కత్తిమీద సామే అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ స్థాయికి తగ్గ ఆటతీరు కనబరిస్తే భారత్ గెలుపు పెద్ద కష్టమేమి కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. మరో సెమీస్ లో బంగ్లాదేశ్ తో న్యూజిలాండ్ వచ్చేనెల 6 వ తేదీన తలపడనుంది.