పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఇంకా అనుసంధానం చేయలేదని గాబరా పడుతున్న వారికి శుభవార్త. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు పాన్ - ఆధార్ అనుసంధానం గడువును మరో మూడు నెలలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2020 సంవత్సరం మార్చి నెల 31వ తేదీ వరకు గడువు పొడిగిస్తున్నట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ప్రకటన చేసింది. గతంలో డిసెంబర్ 31వ తేదీలోగా పాన్ ను ఆధార్ తో లింక్ చేసుకోవాలని లేకపోతే పాన్ రద్దవుతుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ పేర్కొంది.
మార్చి 31వ తేదీలోపు పాన్ - ఆధార్ లింక్ చేయకపోతే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139ఏఏ ప్రకారం పాన్ కార్డును రద్దు చేస్తారు. ఆదాయపు పన్ను శాఖ ఆదేశాల మేరకు పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయడం తప్పనిసరి. పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకపోతే ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయటం వీలు కాదు. పాన్ అనేది ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన అల్ఫా న్యూమరిక్ సంఖ్య.
పాన్ ను ఆధార్ తో లింక్ చేయకపోతే పాన్ కార్డు చెల్లకపోవటంతో పాటు ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే ఈ రీఫండ్ కూడా ఖాతాలో జమ కాదు. కేంద్రం భారీ మొత్తంలో ఆర్థిక లావాదేవీలకు, ఐటీ రిటర్నుల దాఖలుకు ఉపయోగించే పాన్ కార్డును ఆధార్ తో లింక్ చెప్పినా ఇప్పటికీ కోట్లాదిమంది పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయించుకోలేదు. సెప్టెంబర్ నెలలోనే పాన్ - ఆధార్ గడువును డిసెంబర్ 31 కు పొడిగిస్తూ ప్రత్యక్ష పన్నుల బోర్డు నిర్ణయం తీసుకోగా ఆ గడువును ఇప్పుడు మరోసారి పెంచింది.