చిన్న పిల్లలు చేసే పనులు ఒక్కోసారి చాలా సరదాగా ఉంటాయి. పిల్లల అల్లరి ఒక్కోసారి కోపం తెప్పించినా.. కొన్నిసార్లు భలే నవ్విస్తుంది. కల్మషంలేని మనస్సులో వారు చేసే పనులను చూస్తే మనస్సు ఉప్పొంగుతుంది. ఇదిగో ఈ పిల్లాడి డ్యాన్స్ చూస్తున్నప్పుడు కూడా మీకు ఇదే అనుభూతి కలుగుతుంది. స్నేహితుడితో కలిసి సైకిల్ తొక్కుకుంటున్న ఓ బాలుడికి.. ఓ ఇంటి వద్ద నలుపు, తెలుపు రంగులో ఉన్న రెండు కుక్క పిల్లలు కనిపించాయి. అవి అతడిని చూసి అరవడం మొదలుపెట్టాయి. దీంతో ఆ పిల్లాడికి వాటిని మచ్చిక చేసుకోవాలని అనిపించింది. గేటు వేసి ఉండటంతో ధైర్యంగా వాటి దగ్గరకు వెళ్లాడు. వాటిని మచ్చిక చేసుకోవాలని అనుకున్నాడో ఏమో.. బాంగ్రా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. మ్యూజిక్ లేకుండానే ఆ పిల్లాడు డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకున్నాడు. ఆ డ్యాన్స్ ఆ కుక్క పిల్లలకు కూడా బాగా నచ్చాయో ఏమో.. అవి కూడా డ్యాన్స్ చేస్తున్నట్లుగా పైకి కిందకి ఎగురుతూ అతడిపై అరవడం మొదలుపెట్టాయి. ఆ కుక్కల యజమాని ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే.. ఆ వీడియో క్షణాల్లో వైరల్గా మారింది.