లాక్ డౌన్ కారణంగా తెలంగాణలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలకు చెందిన శాంతిభద్రతల విభాగం అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పని చేయనున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్, ప్రధాన రహదారులతో కలిపి మొత్తం 346 చెక్ పోస్టులు, మరికొన్ని చోట్ల బారికేడ్లు ఉండనున్నాయి. ఇక ప్రతి 3 కిలో మీటర్లకు ఒక చెక్ పోస్ట్, గస్తీ బృందాలు, ఇలా హద్దులు దాటి వెళ్లే వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక నిర్ణీత సమయాన్ని మించి రోడ్లపైకి వస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకోనున్నారు.అంతేకాకుండా నగరంలో లాక్ డౌన్ అమలు పర్యవేక్షణకు సీనియర్ ఐపీఎస్ అధికారులను, జోన్ల వారీగా నియామిస్తూ కొత్వాల్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అధికారులు ఆయా మండలాలకు నేతృత్వం వహించనున్నారు. లాక్డౌన్ నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా వీరు ఎప్పటికప్పుడు పలు చర్యలు చేపడతారు. పరిస్థితులను పర్యవేక్షిస్తారు. కాబట్టి అధికారులు విధించిన నిర్ణీత సమయాన్ని ఉపయోగించుకుంటూ, మిగతా సమయంలో ఇంట్లో ఉండాలి అని పోలీసులు కూడా స్పష్టం చేశారు..