కలియుగానికి వచ్చేసరికి ప్రజల్లో వున్న రాక్షస బుద్దిని తీసివేయాలి. అంటే వారిని అధర్మమార్గం నుండి ధర్మమార్గం వైపు బుద్ధిని ప్రచోదించేలా చేయాలని, జ్ఞానభిక్ష పెట్టాలని సాక్షాత్తు పరమేశ్వరుడే ఆదిశంకరాచార్యుల రూపంలో ఆర్యాంబా, శివగురువులనే పుణ్యదంపతులకు కేరళ రాష్ట్రం కాలడీ క్షేత్రంలో పూర్ణానదీ తీరాన వైశాఖ శుద్ధ పంచమి శుభతిథిన తేజోమూర్తుడైన శంకరాచార్యుల వారు జన్మించారు. ఇక కాలినడకన దేశమంతా పర్యటించి మొత్తం -72 మతాలను సమానంగా ఖండిస్తూ, వేద ప్రతిపాదితమైన అద్వైత సిద్ధాంతాన్ని కూడా ప్రతిష్టించారు. జ్ఞాన మార్గాన్ని సూర్యచంద్రులు ఉన్నంత వరకూ ప్రసరింపచేయాలనే ఉద్దేశంతోనే తూర్పున పూరీ లో గోవర్ధన పీఠం , దక్షిణాన శృంగేరి లో శ్రీ శారదా పీఠం , పశ్చిమాన ద్వారక లో శారదా పీఠం, ఉత్తరాన బదరి లో జ్యోతిష్పీఠాలను స్థాపించారు. ఈ పీఠాల పీఠాధిపతుల ద్వారా ఎల్లప్పుడూ జనాలకు ధర్మప్రబోధం జరిగి ,అందరూ వేదోక్త కర్మలు ఆచరించి, జ్ఞాన మార్గాన్ని పొంది, అందరిని సత్య మార్గంలో నడపాలని, లోకోపకారం కోసం శంకరాచార్యులవారు పాటుపడ్డారు