పెళ్లి దుస్తుల్లో.. అందరిముందు వైభవంగా
పెళ్లి చేసుకోవాల్సిన జంట వింతగా, రహస్యంగా
పెళ్లి చేసుకున్నారు. ఆకర్షణగా కనిపించాల్సిన వధువరులు.. ఎలాంటి ఆర్భాటం లేకుండా సాధారణ దుస్తుల్లోనే పెళ్లాడారు. ఇదేదో వారు అందరి దృష్టిని ఆకట్టుకొనేందుకు చేసుకున్న
పెళ్లి కాదు. కన్న
తండ్రి కళ్లల్లో ఆనందం నింపేందుకు ఓ కొడుకు చేసిన ప్రయత్నం. విచిత్రంగా ఆ జంట హాస్పిటల్‌లో
పెళ్లి చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. టెక్సాస్‌కు చెందిన ఆలియా, మైఖెల్ థామ్సన్‌లు గత
మార్చి నెలలో
పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ, మైఖెల్ ఇంట్లోని ఇద్దరు కుటుంబ సభ్యులు చనిపోవడంతో
పెళ్లి వాయిదాపడింది. తాజాగా మరోసారి పెళ్లికి సిద్ధమైన ఈ జంట మళ్లి మైఖెల్
తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను సన్నీవాలేలోని బేలార్ స్కాట్ అండ్ మెడికల్ సెంటర్‌లో చేర్చారు. సరిగ్గా మైఖెల్
పెళ్లి వేడుక రోజునే ఆయనకు అత్యవసరంగా సర్జరీ చేయాల్సి వచ్చింది. దీంతో మళ్ళి ఆ జంట
పెళ్లి వాయిదా పడింది.
మైఖెల్ తండ్రి.. నేను లేకపోయినా ఫర్వాలేదు కానీ
పెళ్లి చేసుకోండి అని ఆ జంటకు సూచించారు. అయితే, మైఖెల్‌కు మాత్రం తన
తండ్రి లేకుండా
పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తేల్చి చెప్పాడు. అప్పటికే ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధలో ఉన్న మైఖెల్.. తన
పెళ్లి తప్పకుండా
తండ్రి చేతులు మీదుగానే జరగాలని నిర్ణయించుకున్నాడు. దీంతో వివాహ వేదికను వదిలి హాస్పిటల్‌కు చేరుకున్నారు.
మైఖేల్ ఇంటి పరిస్థితులను తెలుసుకున్న హాస్పిటల్ సిబ్బంది వారి పెళ్లి కోసం ఏర్పాట్లు చేశారు. వధువరుల కోసం ఒక కేకు, ద్రాక్షరసాన్ని ఏర్పాటు చేశారు. వధువరులు.. పెళ్లి దుస్తులకు బదులు రోగుల సందర్శన కోసం వేసుకొనే వస్త్రాలను ధరించారు. అనంతరం మైఖెల్ తండ్రి ఎదుట నిలుచుని వధువరులు ఉంగరాలు మార్చుకున్నారు. వారి వివాహాన్ని చూసి ఆ తండ్రి కళ్లు ఆనంద భాష్పాలతో చెమ్మగిల్లాయి. ఆ తర్వాత ఇద్దరూ.. పెళ్లి వేదిక వద్దకు చేరుకుని మిగతా కార్యక్రమాలను పూర్తిచేసి, అతిథులకు విందు ఇచ్చారు.