తెరపై నవరసాలు పలికించగల అతికొద్దిమంది తెలుగు నటుల్లో కోట ప్రథమస్థానంలో ఉంటారనడంలో సందేహం లేదు. పాత్ర ఏదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేసి జీవం తీసుకురావడం అన్నది కోటకే సాధ్యం. కమెడియన్‌గా, విలన్‌గా, తండ్రిగా, రాజకీయ వేత్తగా, తాతగా, బాబాయిగా, కమెడియన్ కమ్ విలన్‌గా చేసిన ఆయన తెలుగు, తమిళ్, మళయాళం, బాలీవుడ్‌తో పాటు ఇతర భాషాల్లోని సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించారు. కోట ఉన్నాడంటే సినిమాకు 10 నుంచి 20శాతం వరకు సినిమా సక్సెస్‌కు కలసి వస్తుందని దర్శక నిర్మాతలు భావించేవారు. నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు సినిమా ఇండస్ట్రీతో కోట శ్రీనివాస్‌కు అనుబంధం ఉంది.
కోట శ్రీనివాసరావు కృష్ణా జిల్లా కంకిపాడు 1945, జులై 10న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో ప్రసిద్ధి చెందిన వైద్యుడు. బాల్యం నుంచి కోట శ్రీనివాసరావుకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. బాల్యం నుండి నాటకరంగములో ఆసక్తి ఉన్న కోట సినిమాలలో రంగప్రవేశము చేసేనాటికి రంగస్థలముపై 20 యేళ్ళ అనుభవం గడించాడు. 1978-79లో ప్రాణం ఖరీదు నాటకం వేస్తుండగా ఆ ప్రదర్శన చూసిన సినిమా దర్శక నిర్మాత క్రాంతికుమార్ ఆ నాటకాన్ని సినిమాగా తీయాలనుకున్నాడు. మర్యాద పూర్వకముగా ఆ నాటకములో నటించిన నటీనటులందరినీ సినిమాలో కూడా తీసుకున్నారు. అలా కోట శ్రీనివాసరావు సినీరంగ ప్రవేశం జరిగింది
సినిమాలలో రాకముందు ఈయన స్టేట్ బ్యాంకులో పనిచేసేవాడు. 1968లో ఈయనకు రుక్మిణితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు.ఇతని పేరు కోట ప్రసాద్.ఈయన కూడా నటుడు. 2010 జూన్ 21 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కోట శ్రీనివాసరావు విజయవాడ తూర్పు శాసనసభా నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. 2015 లో ఇతనికి భారత ప్రభుత్వము పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. అహ నా పెళ్ళంట సినిమాలో కథానాయిక తండ్రిగా చేసిన పిసినిగొట్టు పాత్ర చాలా పేరు తెచ్చింది. ఈ డెవడ్రా బాబూ... నాకేంటి ..మరి నాకేంటి, మరదేనమ్మా నా స్పెషల్, అయ్య నరకాసుర, అంటే నాన్నా అది, అనే డైలాగులు కోట శ్రీనివాస్‌కు మంచి ఆదరణ పొందేలా చేశాయి. ఆయన నోటివెంట ఆ డైలాగులు వస్తుంటే థియేటర్లలో నవ్వులు పూసేవి. కోట నటనకు అనేక అవార్డులు దక్కాయి. లెక్కలేనన్ని సన్మానాలు,సత్కారాలు ఆయనకు దక్కాయి.
అందులో కొన్ని ఇవి..
నంది ఉత్తమ విలన్- గణేష్ (1998)
నంది ఉత్తమ విలన్ - చిన్న (2000)
నంది ఉత్తమ సహాయ నటుడు- పృథ్వీ నారాయణ (2002)
నంది ఉత్తమ సహాయ నటుడు - ఆ నలుగురు (2004)
నంది ఉత్తమ సహాయ నటుడు - పెళ్లైన కొత్తలో (2006)