తరువాత మణిరత్నం దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం గీతాంజలి భారీ విజయాన్ని సాధించింది. అద్భుతమైన సంగీతం, మంచి కథతో వచ్చిన ఈ చిత్రం నాగార్జునను ప్రేమ కథా చిత్రాల నాయకుడిగా నిలబెట్టింది. ఇది మణిరత్నం నేరుగా తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం. రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం శివ. ఈ రెండు చిత్రాలు నేటికి నాగార్జున నటించిన అతిపెద్ద భారీ విజయాల్లో ప్రముఖమైనవిగా చెప్పుకోవాలి. ఆ తరువాత అన్నమయ్య చిత్రములో వాగ్గేయకారుడు అన్నమయ్య పాత్రను పోషించే సవాలును స్వీకరించి విజయం సాధించారు. ఈ సినిమా 42 కేంద్రాలలో 100 రోజులు పైగా నడిచింది.
ఈ చిత్రానికి గాను నాగార్జున మొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఈ చిత్రంలో నాగార్జున కనపర్చిన అద్భుత నటనకు ప్రేక్షకుల నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా అనేక ప్రశంసలు లభించాయి. అన్నమయ్య చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. 2006లో శ్రీ రామదాసు విమర్శకుల ప్రశంశలందుకుంది. ఈ చిత్రంలో నటనకు గాను నాగార్జున రాష్ట్ర ప్రభుత్వం నుండి మూడవ సారి ఉత్తమ నటుడి అవార్దు అందుకున్నారు. మంచి కథాబలమున్న పాత్రల్లో నటిస్తూ నేటి యువతరం కథానాయకులకు సవాల్ విసురుతున్నారు. టాలీవుడ్ కింగ్‌గా ప్రఖ్యాతిగాంచారు.