టెక్ దిగ్గజం ఎన్ఆర్ నారాయణ మూర్తి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు మీ కోసం...

పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు అయిన ఆయన పూర్తి పేరు నాగవర రామారావు నారాయణ మూర్తి. 1946 ఆగస్టు 20న కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలోని శిడ్లఘట్ట పట్టణంలో జన్మించిన ఈ దిగ్గజ ఐటీ వ్యవస్థాపకుడు, పదవీ విరమణకు ముందు, ఇన్ఫోసిస్‌లో ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ప్రెసిడెంట్, చీఫ్ మెంటర్ వంటి అనేక బాధ్యతలను నిర్వహించారు.

నారాయణ మూర్తి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీతో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ (మైసూర్ విశ్వవిద్యాలయం) నుండి పట్టభద్రుడయ్యాడు. అతను కాన్పూర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మాస్టర్స్ పూర్తి చేశాడు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, అహ్మదాబాద్‌లో చీఫ్ సిస్టమ్స్ ప్రోగ్రామర్‌గా పని చేశాడు. పూణే (మహారాష్ట్ర)లోని పాట్నీ కంప్యూటర్ సిస్టమ్స్‌లో కూడా పని చేశాడు.

అక్కడే తన భార్య సుధా మూర్తిని కలిశాడు. అక్కడ కార్ల తయారీ కర్మాగారం మహిళా ఇంజనీర్లకు అవకాశాలు లేని రోజుల్లో టెల్కో ప్లాంట్‌లో మెరిట్ ఆధారంగా ఆమె అవకాశాన్ని పొందడం ఒక అద్భుతం. మహిళలను పోటీకి దూరంగా ఉంచడం లింగ వివక్ష అని  ఆరోపిస్తూ ధైర్యమా జెఆర్డి టాటాకు పోస్ట్‌కార్డ్ రాసిన సుధామూర్తిని నారాయణ మూర్తి వివాహం చేసుకున్నాడు.

1981లో ఇన్ఫోసిస్‌ని నారాయణ మూర్తి మరో ఆరుగురు సాఫ్ట్‌వేర్ నిపుణులతో కలిసి రూ.10,000లతో స్థాపించారు. ఈరోజు ఫార్చ్యూన్ మ్యాగజైన్ లోని 12 మంది గొప్ప పారిశ్రామికవేత్తలలో ఒకరిగా మనముందు ఉన్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం 2020 లో ప్రపంచ బిలియనీర్లలో #1135వ స్థానంలో నారాయణ మూర్తి ఉన్నారు. 2019లో భారతదేశంలో అత్యంత ధనవంతులలో #51 వ స్థానంలో నిలిచారు. భారతదేశంలో అవుట్‌సోర్సింగ్‌లో ఆయన చేసిన కృషి కారణంగా టైమ్ మ్యాగజైన్ అతనిని "ఇండియన్ ఐటి రంగానికి పితామహుడు"గా అభివర్ణించింది. మూర్తిని పద్మ విభూషణ్, పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. ఆయనలో దాతృత్వం పాళ్ళు కూడా ఎక్కువే. ఎంతోమందికి సహాయం చేశారు.
 
సుధా, నారాయణ మూర్తికి ఇద్దరు పిల్లలు కుమారుడు రోహన్ మూర్తి, కుమార్తె అక్షత మూర్తి. వారి అల్లుడు రిషి సునక్ బ్రిటిష్ ఎంపీ, భారతదేశంలో ఆర్థిక మంత్రికి సమానమైన ఖజానాకు ఛాన్సలర్.

కఠినమైన జీవితాన్ని కూడా అవకాశంగా మలుచుకుని, లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించిన నారాయణమూర్తి ఆనంద, ఆరోగ్యాలతో మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆశిస్తూ ఆయనకు "ఇండియా హెరాల్డ్" తరపున పుట్టినరోజు రోజు శుభకాంక్షలు.

మరింత సమాచారం తెలుసుకోండి: