లాక్‌డౌన్ నేపథ్యంలో ఎల్ఐసీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీమియం చెల్లింపుల విషయంలో పాలసీదారులకు కొంత ఉపశమనం కలిగించింది. ప్రీమియం చెల్లింపు గడువును 30 రోజుల పాటు పెంచుతున్నట్లు ప్రకటించింది. లాక్ డౌన్ కారణంగా పాలసీదారులు సమస్యలు ఎదుర్కొంటున్నందున మార్చి, ఏప్రిల్ గడువుల చెల్లింపులకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. గ్రేస్ పీరియడ్ మార్చి 22తో ముగిసినా ఏప్రిల్ 15వరకూ అనుమతిస్తున్నట్లు తెలిపింది. అంతేగాకుండా.. సర్వీసు చార్జీలు లేకుండా ఆన్‌లైన్ ద్వారా కూడా చెల్లించవచ్చని పేర్కొంది. మొబైల్ యాప్ ఎల్‌ఐసీ పే డైరెక్ట్, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే, భీమ్, యూపీఐల ద్వారా చెల్లించవ్చని తెలిపింది. అలాగే.. ఐడీబీఐ, యాక్సిస్ బ్యాంకుల వద్ద, కామన్ సర్వీస్ సెంటర్స్ (సీఎస్సీ)ల ద్వారా ప్రీమియం చెల్లించవచ్చని పేర్కొంది.
అలాగే.. తపాలా శాఖ కూడా ఇదే విధమైన నిర్ణయం తీసుకుని పాలసీదారులకు ఉపశమనం కలిగించింది. మార్చి, ఏప్రిల్, మే నెలలకు చెల్లించాల్సిన బీమా ప్రీమియంను జూన్ 30 వరకూ ఎలాంటి పెనాల్టీ లేకుండానే చెల్లించవచ్చని తపాశాల శాఖ ప్రకటించింది. వీటిలో పోస్టల్ లైఫ్ న్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలున్నాయి. రిజిస్టర్డ్ పోర్టల్ ద్వారా వినియోగదారులు ప్రీమియం చెల్లించవచ్చని తెలిపింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. కేవలం నిత్యావసరాలు, అత్యవసరాల కోసం మాత్రమే ప్రజలు బయటకు వస్తున్నారు. ఈనేపథ్యంలో పాలసీదారులు తాము చెల్సించాల్సిన ప్రీమియంలను సకాలంలో చెల్లించలేకపోతున్నారు. దీంతో అటు ఎల్ఐసీ, ఇటు తపాలా శాఖ కూడా పాలసీదారుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రీమియం చెల్లింపు గడువును పెంచాయి.