తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాను కరోనా గజగజా వణికిస్తోంది. ఈరోజు 26 కొత్త కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారి తెలిపారు. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 80కు చేరింది. జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటివరకూ జిల్లాలో అధికారులు 791 నమూనాలు సేకరించారు. ఈ నమూనాలలో 191 పరీక్షల ఫలితాలు తేలాల్సి ఉంది.
రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో జిల్లాను అష్ట దిగ్భంధనం చేయాలని అధికారులు నిర్ణయించారు. మంత్రి జగదీష్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం జిల్లాకు చేరుకుని సమీక్ష నిర్వహించారు. అదే సమయంలో ప్రజలు భయాందోళనకు గురి కాకుండా చర్యలు చేపట్టారు. అధికారులు కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాకు ఇతరులను అనుమతించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 928కు చేరింది. జిల్లాలో ఒక్కరోజే 56 కొత్త కేసులు నమోదయ్యాయి.