టంగుటూరి సూర్యకుమారి.. ఈ పేరు వింటే చాలు తెలుగు నేల పులకరించిపోతుంది.. తెలుగుపాట మురిసిపోతుంది.. గోదారి గుండె ఉప్పొంగుతుంది.. కృష్ణమ్మ హృదయం పరవశించిపోతుంది.. మాటలో పాటలో నటనలో నాట్యంలో కలకాలం మేటిగానే నిలిచారు సూర్యకుమారి. అసమాన ప్రతిభతో తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటారు. మా తెనుగు తల్లికి మల్లె పూదండ.. మా కన్నతల్లికి మంగళహారతులు.. దేశమును ప్రేమించుమన్నా.. మంచి అన్నది పెంచుమన్నా.. వంటి అద్భుతమైన దేశభక్తి గీతాల గాత్ర చిరునామాగా సూర్యకుమారి పేరు నిలిచారు. టంగుటూరి సూర్యకుమారి నవంబర్ 13న ఆంధ్రప్రదేశ్‌లోని రాజామండ్రిలో జన్మించారు. మూడో ఏటి నుంచే పాటను, 12 ఏట నుంచే నటనను ఆరంభించారు. శంకరంబాడి సుందరాచారి రచించిన మా తెనుగుతల్లికి మల్లె పూదండ పాటను పెదతండ్రి టంగుటూరి ప్రకాశం పంతులుతో కలిసి అనేక సభల్లో సూర్యకుమారి పాడారు. అదే సమయంలో ఆమె మంచి వక్తగా కూడా గుర్తింపు పొందారు.
ఆమె పాడిన ప్రతీ పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. 1940 నుంచి 1950లలో 25 భారతీయ చిత్రాలలో నటించింది. మిస్ మద్రాస్ 1952 పోటీల్లో విజేతగా నిలిచారు. అంతేగాకుండా.. మిస్ ఇండియా 1952 పోటీల్లో రన్నరప్‌గా నిలిచారు. 1953లో భారత చలనచిత్రపరిశ్రమ బృందంలో సభ్యురాలిగా అమెరికాలో పర్యటించిన ఆమె తన ఉపన్యాలతో ఆకట్టుకున్నారు. అంతేగాకుండా.. 1959లో కొలంబియా యూనివర్సిటీలో ట్యూటర్‌గా చేరి, పాశ్చత్య సంగీతంలో శిక్షణ పొందారు. ఈ క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులు సంపాదించారు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌లో స్థిరపడిన సూర్యకుమారి 1965లో ప్రముఖ పెయింటర్ హెరాల్డ్ ఎల్విన్‌ని వివాహం చేసుకున్నారు. ఇలా తన బహుముఖ ప్రజ్ఞతో అనాడే తెలుగు, భారతీయ పాటలకు గ్లోబల్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టారు సూర్యకుమారి. తుదిశ్వాస వరకూ భారతీయ కళలకు సేవలందించిన ఆమె 2005 ఏప్రిల్ 25న కన్నుమూశారు.