ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కరోనా కష్ట కాలంలో కూడా విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సీఎం జగన్ ఈరోజు జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 12 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. సీఎం కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయాలను తెలియజేసింది.
ప్రభుత్వం ఒకే ఆర్థిక సంవత్సరంలో అన్ని త్రైమాసికాలకు సంబంధించిన బోధనారుసుములను బకాయిలు లేకుండా చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఈ పథకం కోసం 4,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను ఖర్చు చేయనుందని సమాచారం. ఏపీ ప్రభుత్వం గత ప్రభుత్వం చెల్లించాల్సిన 1900 కోట్ల రూపాయల బకాయిలను కూడా చెల్లిస్తున్నట్లు ప్రకటన చేసింది. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా 4,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేయడంపై విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీలకు కాకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేయనుంది.