తెలంగాణ రాష్ట్ర సీఎస్ తో మరికాసేపట్లో విపక్ష నేతలు భేటీ కానున్నారు. కరోనా కట్టడి, సహాయక చర్యలు, రైతుల సమస్యల గురించి ప్రధానంగా చర్చించనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్, ఎల్ రమణ, చాడా వెంకట్ రెడ్డి, కోదండరాములు సీఎస్ సోమేష్ కుమార్ తో రాష్ట్రంలోని రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి, ఇతర విషయాల గురించి చర్చించనున్నారు.
విపక్ష నేతలు సీఎస్ ను కలవడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. విపక్షాలు సీఎంను కలవకుండా సీఎస్ ను కలవడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ప్రభుత్వ వైఖరికి నిరసనగా భవిష్యత్తు కార్యాచరణ, ఇతర అంశాల గురించి ప్రధానంగా చర్చ జరగనుంది. విపక్షాలు రైతుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, తక్కువ సంఖ్యలో కరోనా టెస్టులు చేస్తున్నాయని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.
పేదలు, వలసకార్మికుల సమస్యల గురించి కూడా విపక్షాలు సోమేష్ కుమార్ తో చర్చించనున్నాయని తెలుస్తోంది.