దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో కేంద్రం మే నెల 17 వరకు లాక్ డౌన్ ను పొడిగించింది. అయితే లాక్ డౌన్ వల్ల సామాన్యులు, రైతులు, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. లాక్ డౌన్ వల్ల ఆకలిబాధలతో అలమటించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రజా రవాణా స్తంభించడంతో సొంతూళ్లకు కొందరు నడక మార్గం ద్వారా సొంతూళ్లకు చేరుకుంటున్నారు.
తాజాగా కేంద్రం మరోసారి లాక్ డౌన్ పొడిగించడంతో కర్ణాటకలోని చెళ్లికెరకు వలస కూలీగా వెళ్లిన నిండు గర్భిణి సలోని, ఆమె కుటుంబ సభ్యులు ప్రకాశం జిల్లా పొదిలికి కాలినడకన బయలుదేరారు. దాదాపు 130 కిలోమీటర్లు నడిచిన తరువాత నిండు గర్భిణి అస్వస్థతకు గురైంది. విషయం తెలిసిన పోలీసులు వెంటనే ఆమెకు ఆశ్రయం కల్పించారు. ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి ఈ పాస్ అనుమతి జారీ చేసి ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను సొంతూరుకు తరలించారు.
నిండు గర్బిణికి అవసరమైన సాయం అందించి మానవత్వం చాటుకున్న పోలీసులపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.