దేశంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 50,000కు చేరువలో ఉండగా మృతుల సంఖ్య 1,500 దాటింది. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్దంగా పరిశోధనలు జరుగుతున్నాయి. శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో ఈ వైరస్ గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
కొన్ని రోజుల క్రితం శాస్త్రవేత్తలు కరోనా లక్షణాలు కనిపించడానికి 28 రోజులు పట్టే అవకాశం ఉందని చెప్పగా తాజాగా ఉత్తరప్రదేశ్ వైద్యులు కరోనా లక్షణాలు కనిపించడానికి నాలుగు వారాలు పట్టే అవకాశం ఉందని ధృవీకరించారు. సీనియర్ వైద్యుడు డాక్టర్ ఎస్‌కే కల్రా కరోనా సోకిన వారిలో 14 రోజుల్లో వైరస్ లక్షణాలు బయటపడటం లేదని తెలిపారు.
కరోనా రోగులలో వైరస్ తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు పరీక్షలు జరిపితే నెగిటివ్ వస్తోందని.... ఆ తర్వాత వైరల్ లోడ్ పెరిగి పాజిటివ్ నిర్ధారణ అవుతోందని వైద్యులు చెబుతున్నారు. క్వారంటైన్ లో ఉన్నవారికి తరచూ పరీక్షలు నిర్వహిస్తే మాత్రమే కరోనా సోకిందో లేదో తేలుతుందని వైద్యులు చెబుతున్నారు.