తెలంగాణలో నేటి నుంచి వైన్స్ షాపులు ఓపెన్ చేయనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. 15 కంటోన్మెంట్ ఏరియాల్లో ఉన్న షాపులు మినహా గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లలో ఉన్న అన్ని వైన్స్ షాపులు ఓపెన్ చేసుకోవచ్చన్నారు. బార్లు, క్లబ్ లు ఓపెన్ చేయడానికి మాత్రం అనుమతి లేదన్నారు.  ఈ సందర్భంగా తెలంగాణ సమాజం మద్యం కొనుగోళ్లలో క్రమశిక్షణను చూపించుకోవాలి విజ్ఞప్తి చేశారు. మద్యం కొనుగోళ్లలో మిగతా రాష్ట్రాల ప్రజల మాదిరి ఆగం ఆగం చేస్తే గంటలోనే వైన్స్ షాపులు మూసేస్తామని హెచ్చరించారు. బయట రాష్ట్రాలు చూస్తున్నామని.. అలా జరిగితే షాపులు మొత్తం క్లోజ్ చేయిస్తామని అన్నారు. మద్యం కొనుగోలుదారులు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించి, మాస్కులను ధరించాలని కోరారు. మాస్కులు ధరించని వాళ్లకు మద్యం అమ్మకూడదని వైన్స్ షాప్ యజమానులకు విజ్ఞప్తి చేశారు.

 

తాజాగా పెరిగిన ధరలకే ఈరోజు మద్యాన్ని అమ్మారు. మరోవైపు హైదరాబాద్ నాంపల్లిలోని అబ్కారీ భవన్ లో ఉన్నతాధికారులతో ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాలు ముందుగానే మద్యం దుకాణాలను తెరిచాయని అన్నారు. మద్యం అందుబాటులో లేకపోవడంతో గుడుంబా మళ్లీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కొంత మంది అవకాశ వాదులు మద్యం మాఫియాకు తెగబడుతున్నారని..  జడ్చర్లలో గుడుంబా తయారీని అడ్డుకున్న సిబ్బందిపై దాడి చేశారని తెలిపారు.

 

కొన్ని చోట్ల సారాకు రంగు కలపి విస్కీలా అమ్ముతున్నారని చెప్పారు. వీటన్నింటిపై మంత్రులు, ఉన్నతాధికారుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే మద్యం దుకాణాలను తెరవాలని నిర్ణయించామని చెప్పారు. పక్క రాష్ట్రంలో మద్యం ధరలను 75 శాతం పెంచడంతో తప్పని పరిస్థితుల్లో మన రాష్ట్రంలో కూడా 16 శాతం వరకు ధరలను పెంచాల్సి  వచ్చిందని మంత్రి తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: