దేశ రాజధాని ఢిల్లీ ప్రజలను భూకంపం గజగజా వణికిస్తోంది. నెలరోజుల్లో మూడోసారి ఢిల్లీలో భూప్రకంపనలు వచ్చాయి. ఈరోజు మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వరుస భూప్రకంపనలు ఆందోళన కలిగించే పరిణామమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదైంది.
గత నెల 12, 13 స్వల్పంగా భూమి కంపించగా నెలరోజుల వ్యవధిలో మరోసారి భూమి కంపించడం గమనార్హం. ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్న సమయంలో భూప్రకంపనలు ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచి ఢిల్లీ నగరంలో సాధారణ రోజులతో పోలిస్తే భిన్న వాతావరణం నెలకొంది. భారీ ఈదురుగాలులు వీస్తూ ఉండటంతో పాటు నగరమంతా చీకట్లు కమ్ముకున్నాయి.