ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ ఏపీ ఆర్టీసీ బస్సుల గురించి, ఇతర విషయాల గురించి స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ఆర్టీసీ ఛార్జీలను పెంచడం లేదని తెలిపారు. ఏపీ ఆర్టీసీ బస్సుల్లో సీట్లను కుదిస్తున్నట్టు పేర్కొన్నారు. బస్సుల్లో పరిమిత సంఖ్యలో ప్రయాణికులకు అనుమతి ఇస్తామని తెలిపారు. పల్లెవెలుగు బస్సుల్లో 56 సీట్లకు బదులు 35 సీట్లు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో 30 సీట్లకు బదులు 20 సీట్లలో మాత్రమే ప్రయాణికులకు అనుమతులు ఇస్తామని తెలిపారు.
అల్ట్రా డీలక్స్ లో 40కు బదులుగా 29, సూపర్ డీలక్స్ లో 36కు బదులుగా 26 సీట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రేపటి నుంచి 17 శాతం మేర 436 రూటల్లో బస్సు సర్వీసులు నడపనున్నట్టు తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. టికెట్ బుకింగ్ డేటాను 15 రోజుల పాటు స్టోర్ చేస్తామని కాంటాక్ట్ స్టోరింగ్ కు ఉపయోగపడుతుందని తెలిపారు. 1,683 బస్సులు రోడ్డెక్కుతాయని... రాయితీ పాసులకు అనుమతులు లేవని తెలిపారు.