ఏపీ ప్రభుత్వం పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడంపై జారీ చేసిన జీవో 623ను హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు ప్రభుత్వ కార్యాలయాలకు ఉన్న రంగులను తొలగించాలని ఆదేశించిందని... మరో రంగును అదనంగా వేయడం కోర్టు ధిక్కారమేనని సోమయాజులు అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం హైకోర్టు, సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పాటించడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు.
అయితే ప్రభుత్వ తరపు న్యాయవాది స్పందిస్తూ అదనంగా వేస్తున్న రంగు పార్టీ రంగు కాదని చెప్పగా హైకోర్టు న్యాయవాది వాదనపై అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం కోర్టులు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించడం లేదని పేర్కొంది. కోర్టు ధిక్కారం కింద సుమోటోగా కేసు నమోదు చేస్తున్నామని... సీఎస్, సీఈసీ పంచాయతీరాజ్ కార్యదర్శి వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 28న తదుపరి విచారణ జరగనుంది.