దాదాపు రెండు నెలల తర్వాత దేశీయ విమాన సర్వీసులు ఈరోజు నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీంతో భారీ సంఖ్యలో ప్రయాణికులు ఎయిర్ పోర్టులకు చేరుకున్నారు. దేశవ్యాప్తంగా పలు విమాన సర్వీసులను కేంద్రం ప్రకటించగా పలు విమానశ్రయాల్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ సర్కార్ ఈరోజు విశాఖ, విజయవాడ నగరాల నుంచి విమాన రాకపోకలకు అనుమతులు ఇవ్వలేదు.
తెలంగాణలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో ముందస్తు సమాచారం ఇవ్వకుండా పలు విమాన సర్వీసుల్లో మార్పులు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎయిరిండియా వివిధ కారణాల వల్ల పలు మార్గాల్లో విమాన సర్వీసులను రద్దు చేయగా ఈరోజు కేవలం 30 విమానాలు మాత్రమే రాకపోకలు సాగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి 80 సర్వీసులను రద్దు చేసినట్టుగా సమాచారం. పలు రాష్ట్రాలు పరిమిత సంఖ్యలో మాత్రమే విమాన సర్వీసులకు అనుమతించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.